సాయిరెడ్డి సన్యాసం అందుకే.. కేతిరెడ్డి క్లారిటీ!

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించిన తర్వాత ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుుగుతోంది.

Update: 2025-01-27 08:00 GMT

వైసీపీ సీనియర్ నేత వి.విజయసాయిరెడ్డి రాజీనామాపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఆకస్మాత్తుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఏకంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే తన నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ, ఆర్థిక అంశాలు లేవని చెబుతున్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ విషయంలో టీడీపీ ఘాటుగా స్పందిస్తుండగా, వైసీపీ నుంచి పెద్దగా ఎవరూ మాట్లాడలేదు. అయితే ఆ పార్టీలో విలక్షణ నేతగా పేరొందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం విజయసాయిరెడ్డి రాజీనామాకు ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందంటూ తేల్చిచెప్పారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించిన తర్వాత ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుుగుతోంది. ఆకస్మాత్తుగా ఆయన రాజీనామాకు కారణమేమై ఉంటుందని అంతా ఆరా తీస్తున్నారు. వైసీపీ అధిష్ఠానం ఈ విషయంలో సాయిరెడ్డి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఎక్స్ లో ప్రకటించింది. కానీ, ఆ పార్టీ నేతలు ఎవరూ సాయిరెడ్డి రాజీనామా ఉపసంహరించుకోమని అడగలేదు. ఇదే సమయంలో సాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చిందన్న విషయమూ ఎవరూ చెప్పలేదు. కానీ, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం వీఎస్ఆర్ రాజీనామాకు ఇదే కారణమని మీడియాలో ప్రకటించారు.

వైసీపీ రాజ్యసభాపక్ష నేతగా ఉన్న విజయసాయిరెడ్డి గతంలో ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగానూ వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన పనితీరుపై చాలా ఆరోపణలు వచ్చాయి. దీంతో వైవీ సుబ్బారెడ్డిని విజయసాయి స్థానంలో ఇన్ చార్జి చేశారు. అయితే ఎన్నికల్లో దారుణ ఓటమికి విజయసాయిపై వచ్చిన ఆరోపణలు కొంత కారణమనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కాకినాడ సెజ్, సీపోర్టు వాటాల బదిలీ కూడా విజయసాయిరెడ్డికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతల అవినీతి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అవినీతి కేసుల్లో ఇప్పటికే చాలా మంది ముఖ్యమంత్రులను రాష్ట్రాల మంత్రులను అరెస్టు చేయించింది. ఇలాంటి సమయంలో సాయిరెడ్డి ఏమీ అతీతుడు కాదంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే కేతిరెడ్డి ప్రకటన ప్రకారం కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసే సాయిరెడ్డి రాజకీయ సన్యాసానికి కారణమైందని వైసీపీ క్లారిటీ ఇచ్చినట్లైంది. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కేతిరెడ్డి చెబుతున్నా, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చను ఆయన బయటపెట్టారని అంటున్నారు.

కాకినాడ పోర్టు కేసు తప్పా సాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయానికి మరో కారణం లేదని కేతిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే కేసుల నుంచి బయటపడొచ్చని సాయిరెడ్డి భావించి ఉండొచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. కేతిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సాయిరెడ్డి కేసులపై బీజేపీ ఫోకస్ చేసిందనే విషయం అర్థమవుతోందని అంటున్నారు. దీంతో త్వరలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.


Full View


Tags:    

Similar News