జగన్ వైసీపీ ఏపీ ఓటర్ల మీద కేతిరెడ్డి సంచలన కామెంట్స్ !

వైసీపీ సీనియర్ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటారు.

Update: 2024-09-20 16:30 GMT

వైసీపీ సీనియర్ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆయనలో ఇంత ఫైర్ ఉందని ఓటమి తరువాత కానీ జనాలకు పెద్దగా తెలిసింది లేదు. లేటెస్ట్ గా ఆయన ఒక వీడియో బైట్ వదిలారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు.

వైసీపీ మంచి పనులు చేసింది చెప్పుకోలేక ఓడింది. ఇక విపక్షంలోని వచ్చాక కూడా నిందలు పడుతోంది అని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం తీరు మారాలని అన్నారు. చంద్రబాబు ఏకంగా తిరుమల తిరుపతి దేవుడు లడ్డూతోనే వైసీపీ మీద భారీ నింద వేశారు అని కేతిరెడ్డి అన్నారు. ఇందులో వైసీపీ తప్పు చేసింది లేదని అన్నారు.

అయితే ఆ విషయం అయినా వైసీపీ అధినాయకత్వం బాహాటంగా వచ్చి జనాలకు చెప్పాల్సి ఉందని అన్నారు. జగన్ తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని అక్కడే సత్య ప్రమాణం చేస్తే ఈ విషయంలో రాజకీయ విమర్శల నుంచి తప్పించుకోవచ్చునని సలహా ఇచ్చారు. అలా కాకుండా ఊరుకుంటే జగన్ తో పాటు వైసీపీ కూడా నష్టపోతుందని అన్నారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ విషయంలో వాస్తవాలు ఏమిటి అన్నవి నిరూపించాల్సి ఉందని అన్నారు. మరో వైపు వైసీపీ నుంచి తాను బయటకు వెళ్ళేది లేదని అన్నారు. తన మీద కూడా వార్తలు ప్రచారం చేస్తున్నారు అవన్నీ తప్పు అని ఖండించారు. తాను వైఎస్సార్ కుటుంబం తోనే రాజకీయం చేస్తాను అని అన్నారు. గెలుపు ఓటములు సాధారణం అని ఓడితే పార్టీని వీడిపోవడం తప్పు అన్నారు.

ఇదిలా ఉండగా ముందు వైసీపీని చక్కదిద్దుకుని ఆ మీదట బయట శత్రువులతో పోరాడితే ప్రయోజనం ఉంటుందని కేతిరెడ్డి అన్నారు. వైసీపీని పూర్తిగా వాడుకుని బాగు పడిన వారు అంతా ఇపుడు వీడిపోతున్నారు అని అన్నారు. పార్టీలో ఉన్న చెత్తను బయటకు పంపించాలని పూర్తి ప్రక్షాళన చేయాలని కూడా ఆయన జగన్ కి సూచించారు.

ఓటమి ఎవరికీ ఎపుడూ శాశ్వతం కాదని వెలుగు నీడలు మాదిరిగా ఓటమి తరువాత విజయం ఉంటుందని ఆయన అన్నారు. వైసీపీ కూడా అధికారంలోకి తప్పకుండా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానికి ఒక లాజిక్ పాయింట్ చెప్పారు. ఏపీ ఓటర్లలో ఆకాంక్షలు ఎక్కువ అయ్యాయని అన్నారు.

అందువల్ల ఎవరెంత మేలు చేసినా వారు ప్రతీ అయిదేళ్లకూ మార్పుని కోరుకుంటారని ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదే అని ఆయన అన్నారు. అదే సమయంలో మంచి పోస్టింగుల కోసం కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుని ఆయన తప్పు పట్టారు. మొత్తానికి కేతిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News