సినిమా వాళ్ల జోలికిపోయి చెడు మూటగట్టుకున్నాం జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చి తమ ఓటమిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు

Update: 2024-08-01 07:31 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చి తమ ఓటమిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. సీఎంవోలో ధనుంజయ్‌ రెడ్డి అనే ఐఏఎస్‌ అధికారి వల్ల దెబ్బతిన్నామని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంతు వచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి 2009, 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి, 2019లో వైసీపీ నుంచి ఆయన విజయం సాధించారు. ఇటీవల ఎన్నికల్లో కేతిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆయన 2019లో ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ‘గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం’ పేరిట ప్రతి రోజూ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేవారు. అలాంటిది ఆయన కూడా ఓడిపోవడం చాలామందిని నివ్వెరపరిచింది.

ఈ నేపథ్యంలో తాజాగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. ఇంతకు ముందు కూడా ఆయన పలు యూట్యూబ్‌ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా వాళ్ల వల్లే వైసీపీ చెడుమూటగట్టుకుందన్నారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం మంచి విషయమే అయినా అది ప్రజలకు ఎక్కలేదని కేతిరెడ్డి తెలిపారు.

ప్రజలు తమ అభిమాన హీరోల సినిమాలను ఎంత ఖర్చు పెట్టయినా, బ్లాక్‌ లో అయినా కొనుక్కుని చూస్తారని.. వాళ్లకు లేని బాధ మనకెందుకు అని కేతిరెడ్డి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. సినిమా టికెట్‌ రేట్లు తగ్గించి మనం (వైసీపీ) చెడును మూటగట్టుకున్నామని స్పష్టం చేశారు. సినిమా వాళ్ల వల్ల అందరికీ దూరమయ్యామన్నారు.

సినిమా టికెట్‌ రేట్లు తగ్గించి సినిమా వాళ్లతో నిష్టూరాలు ఎదుర్కొన్నామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఎవరి జీవితం వాళ్లదని.. సినిమా టికెట్ల రేట్ల గురించి మనకెందుకని కుండబద్దలు కొట్టారు. బ్లాక్‌ లో కొనుక్కుని కూడా అభిమానులు తమ హీరోల సినిమాల చూస్తారని.. వాళ్లకు లేని బాధ మనకెందుకని ప్రశ్నించారు. సినిమా టికెట్‌ రేట్ల జోలికి తాము పోకుండా ఉండాల్సిందన్నారు. మనం తగ్గిస్తున్నాం.. ప్రజలకు మంచి చేస్తున్నామనే విషయాన్ని ప్రజలు ఆలోచించరని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ముఖ్యంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను లక్ష్యంగా చేసుకుని నాటి జగన్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ రేట్లను తగ్గించిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. పవన్‌ హీరోగా వచ్చిన వకీల్‌ సాబ్, భీమ్లా నాయక్‌ చిత్రాలకు నామమాత్రపు టికెట్‌ రేట్లను జగన్‌ ప్రభుత్వం నిర్దేశించింది. అంతేకాకుండా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలను సినిమా థియేటర్ల వద్ద మోహరించింది.

అంతేకాకుండా సినిమా టికెట్‌ రేట్లను మాట్లాడటానికి వచ్చిన స్టార్‌ హీరోలు చిరంజీవి, మహేశ్, ప్రభాస్, దర్శకుడు రాజమౌళి వంటివారిని బయటనే ఆపేసి నడిపించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన వీడియోలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ను అతిగా టార్గెట్‌ చేయడం తమ కొంపముంచిందని కేతిరెడ్డి ఒప్పుకున్నారు. పవన్‌ ను టార్గెట్‌ చేసుకోవడంతో కాపు సామాజికవర్గమంతా తమకు దూరమయ్యిందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News