కరకట్టకు రాత్రి వేళ బస్తాల కొద్దీ ఫైళ్లను తెచ్చి తగలెట్టేశారు!
పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద ఇన్నోవా వాహనాన్ని నిలిపి.. అందులో ఉంచిన బస్తాల్లోని ఫైళ్లు.. అప్లికేషన్లను గుట్టగా పడేసి మంట పెట్టారు.
షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. ప్రభుత్వ వాహనం అన్న స్టిక్కర్ ఉన్న ఇన్నోవా వాహనంలో వచ్చిన కొందరు బస్తాల కొద్దీ ఫైళ్లు.. అప్లికేషన్లను గుట్టుగా తగలబెట్టేయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ - అవనిగడ్డ కరకట్టపై చోటు చేసుకున్న ఈ ఉదంతంలో తగలబడినవి కీలక పత్రాలు.. రికార్డులన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద ఇన్నోవా వాహనాన్ని నిలిపి.. అందులో ఉంచిన బస్తాల్లోని ఫైళ్లు.. అప్లికేషన్లను గుట్టగా పడేసి మంట పెట్టారు. ఇందులో సీఎంవోకు చెందిన ఫైళ్లు.. కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డు డిస్కులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు రావటంతో అక్కడి స్థానికులు అలెర్టు అయ్యారు. వెంటనే సదరు సమాచారాన్ని పెనుమలూరు ఎమ్మెల్యేకు.. టీడీపీ నేతలకు సమాచారం అందించారు.
దీంతో పలువురు అక్కడకు చేరుకోవటంతో.. ఇన్నోవాలో ఉన్న వారు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో.. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగి.. యనమలకుదురులో ఇన్నోవా వాహనాన్ని పోలీసులు అడ్డుకొని.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ సూచనతో తాము ఈ ఫైళ్లను తీసుకొచ్చి తగలబెట్టినట్లుగా ఇన్నోవా డ్రైవర్ నాగరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. కాలిన ఫైళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. సగం కాలిన ఫైళ్లు కొన్నింటిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉండటాన్ని గుర్తించారు. మరికొన్నింటిలో కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఫైళ్లుగా గుర్తించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే అసలు విషయాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.