ఈ కీలక ఫైళ్లు, పత్రాలపై ప్రభుత్వం కన్ను!

కూటమి ప్రభుత్వం ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. జూన్‌ 12న చంద్రబాబు, మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Update: 2024-06-10 10:06 GMT

కూటమి ప్రభుత్వం ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. జూన్‌ 12న చంద్రబాబు, మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కీలక ఫైళ్లు, పత్రాలు, హార్డ్‌ డిస్కులు మాయం కాకుండా ఇప్పటికే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏపీ సీఐడీ సిట్‌ ఆఫీసు, ఏపీ ఫైబర్‌ నెట్, ఏపీ బేవరెజేస్‌ కార్పొరేషన్, ఏపీ మైనింగ్‌ విభాగం, ఏపీ మైన్స్, మినరల్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ తదితరాలను సీజ్‌ చేశారు. వాటిలో కీలక ఫైళ్లు, పత్రాలు, హార్డ్‌ డిస్కులు పోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో గనుల తవ్వకం (మైనింగ్‌), బీచ్‌ శాండ్‌ తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, మద్యం అమ్మకాలపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. వీటిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని టీడీపీ ఆరోపించింది. వైసీపీ అధిష్టానానికి అనుకూలంగా ఉండే అధికారులను డిప్యుటేషన్‌ పై రాష్ట్రానికి తెప్పించి.. వారికి కీలక బాధ్యతలను అప్పగించి చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇసుక, మైనింగ్, మద్యం అమ్మకాలకు సంబంధించి ఏ కీలక ఆధారం బయటకు పోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మైనింగ్, ఇసుక తవ్వకాలకు సంబంధించి గనుల విభాగం డైరెక్టర్‌ వెంకటరెడ్డి, మద్యం అమ్మకాలకు సంబంధించి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, ఏపీ ఫైబర్‌ నెట్‌ అక్రమాలపై ఆ సంస్థ ఎండీ మధుసూదన్‌ రెడ్డి తదితరులపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఈ ముగ్గురిపై వేటే సింది. ప్రస్తుతం ఉన్న బాధ్యతల నుంచి వారిని తొలగించింది. వేరే ఏ పదవులు ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో ఈ ముగ్గురిని రిపోర్టు చేయాలని ఆదేశించింది.

ఇప్పటికే ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి పలు కీలక ఫైళ్లు, పత్రాలను తన కారులో పట్టుకుపోయారని ఆయనపై సీఐడీ కేసులు దాఖలు చేసింది. హైదరాబాద్, విజయవాడలో ఆయన నివాసముంటున్న అపార్టుమెంట్లలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జే బ్రాండ్‌ మద్యం సరఫరా చేసి భారీగా దోచుకోవడంలో వాసుదేవరెడ్డి పాత్ర ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక గనుల శాఖ డైరెక్టర్‌ హోదాలో వెంకటరెడ్డి బీచ్‌ శాండ్‌ మైనింగ్, ఇసుక తవ్వకాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయని అంటున్నారు. వైసీపీ పెద్దలకు మేలు కలిగేలా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు.

ఇక ఫైబర్‌ నెట్‌ ఎండీ మధుసూదన్‌ రెడ్డి సీసీ కెమెరాల కొనుగోలు కోసమంటూ రూ.350 కోట్లు పక్కదారి పట్టించార నే ఆరోపణలున్నాయి. అలాగే 150 రూపాయలుగా ఉన్న ఏపీ ఫైబర్‌ నెట్‌ ను రూ.350కి పెంచి దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో గనుల శాఖ, ఎక్సైజ్‌ శాఖ, ఏపీ బేవరెజేస్‌ కార్పొరేషన్, ఏపీ ఫైబర్‌ నెట్‌ ల్లో ఒక్క ఫైలు కూడా మాయం కాకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సమాచార, ప్రచార విభాగం డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ రెడ్డిపై కూడా వేటు పడింది. వైసీపీ అనుకూల పత్రికలు, చానెళ్లకు మాత్రమే కోట్ల రూపాయల ప్రకటనలు కట్టబెట్టారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ విభాగాల్లో ఒక్క ౖఫైలు, పత్రం, హార్డ్‌ డిస్కులు పోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టానే వీరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ కూడా కీలక పత్రాలు, పైళ్లు మాయం కాకుండా చూడాలని కోరారు. ఇప్పటికే కీలక పత్రాలు మాయం కావడంపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని కోరారు. ముఖ్యంగా మైనింగ్, ఇసుక, మద్యంలో భారీగా అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయన్నారు. వీటితో ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. ౖఫైళ్లు మాయం కావడం ఆందోళనకరమని.. కొత్త ప్రభుత్వం దీనిపై దర్యాప్తు జరిపించాలన్నారు.

Tags:    

Similar News