కఠిన చట్టాలతో నలిపేసి..మహిళలు పువ్వులాంటివారు అంటున్న సుప్రీం లీడర్!

అంతేకాదు.. ఆ దేశంలో 'హిజాబ్ ధారణ' అనేదానిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీస్ వ్యవస్థే ఉంది.

Update: 2024-12-19 15:30 GMT

రెండేళ్ల కిందట ఏం జరిగిందో గుర్తుందా..? కేవలం ముఖం కనిపించేలా వస్త్రం ధరించనందుకు ఓ యువతిని ఇరాన్ లో అత్యంత కిరాతకంగా హింసించారు.. ఆపై ఆమె మరణించింది.. దీంతో ఆ దేశంలో తీవ్ర హింస చెలరేగింది. ఆందోళనలు మిన్నంటాయి. కొందరు యువత మరణించారు కూడా. అంతేకాదు.. ఆ దేశంలో ‘హిజాబ్ ధారణ’ అనేదానిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీస్ వ్యవస్థే ఉంది.

ఇరాన్.. ఒకప్పుడు ఫ్యాషన్

ఇరాన్ ఇప్పుడు సంప్రదాయ దేశంగా కనిపిస్తుండొచ్చు. కానీ, ఒకప్పుడు అది పాశ్చాత్య దేశాల తరహాలో ఆధునిక శైలిలో ఉండేది. అయితే, ఆయతుల్లా ఖొమేనీ సారథ్యంలో 1979లో ఇస్లామిక్‌ విప్లవం వచ్చాక సంప్రదాయాలకు పెద్దపీట వేయడం మొదలైంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్‌ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఇది అమలయ్యేలా నైతిక పోలీసు (మోరల్ పోలీస్) విభాగం పర్యవేక్షణ చేసేది. హిజాబ్ ధారణను వ్యతిరేకించినందుకే మాసా అమీని అనే యువతిని అరెస్టు చేశారు. ఆపై కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించింది.

కుంకుమపువ్వు నేలలో..

ఇరాన్ అంటే కుంకుమ పువ్వు నేల. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంట ఇరాన్ లోనే 90 శాతం పండుతుంది. అలాంటి దేశంలో హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో వేలమంది మహిళలు రోడ్డు పైకి వచ్చారు. వీరికి అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలిచింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పలువురిని అరెస్టు చేశారు. దీంతో తన పాలనకు వ్యతిరేకంగా.. మహిళలు చేస్తున్న నిరసనల వెనుక వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఆరోపించారు.

సున్నితమైన పువ్వులట..

ఇరాన్ లో అధ్యక్షుడు ఉంటారు. కానీ, మత నాయకుడైన సుప్రీం లీడర్ చెప్పిందే చెల్లుతుంది. ఇప్పుడు ఈ హోదాలో ఖమేనీ ఉన్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కూడా ఖమీనీకే రిపోర్ట్ చేస్తుంది. ఇక హిజాబ్ ధారణ వంటి కఠిన నిబంధనలతో మహిళలపై ఆంక్షలు విధించే ఇరాన్ లో ఖమేనీ మహిళలను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

మహిళలు సున్నితమైన పూలతో సమానం అంటూ ఖమేనీ ట్వీట్‌ చేశారు. ‘స్త్రీ ఇంట్లో పని మనిషి కాదు. స్త్రీని పువ్వులా చూసుకుంటూ.. తాజాదనం, సువాసన, దానినుంచి కలిగే ప్రయోజనాలను పొందాలి’ అని కవితాత్మకంగా రాసుకొచ్చారు. మరో పోస్టులో ఇంట్లోని స్త్రీ, పురుషుల పాత్రలను వివరించారు. ‘కుటుంబంలో స్త్రీ, పురుషుల పాత్రలు వేర్వేరు. ఖర్చులకు పురుషులు బాధ్యత వహిస్తే.. సంతానోత్పత్తిని స్త్రీ చూస్తుంది. అయితే, ఇది ఆధిక్యాన్ని సూచించదు. దీని ఆధారంగా వారి వారి హక్కులను లెక్కించలేం’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News