టీడీపీని ఎన్డీయేలోకి అహ్వానించారు...!

తెలుగుదేశం పార్టీ గురించి పొత్తులు ఎత్తుల గురించి ఇపుడు రకరకాలైన వ్యాఖ్యానాలు వస్తున్నాయి

Update: 2024-02-22 14:43 GMT

తెలుగుదేశం పార్టీ గురించి పొత్తులు ఎత్తుల గురించి ఇపుడు రకరకాలైన వ్యాఖ్యానాలు వస్తున్నాయి. బీజేపీ పొత్తుల కోసం టీడీపీయే ఎదురుచూస్తోందని అవతల వైపు వారు బెట్టు చేస్తున్నా వేచి ఉంటోందని కూడా పలు రకాలైన వార్తాకధనాలు వస్తున్నాయి. వైసీపీ అయితే పొత్తుల ఊత లేకపోతే టీడీపీ బతికి బట్టకట్టలేదని దారుణంగా విమర్శిస్తున్న సంగతి విధితమే.

వైసీపీ ప్రత్యర్ధి కాబట్టి అలా అంటుందని సరిపెట్టుకోవచ్చు. కానీ మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వల్లనే బీజేపీ టీడీపీతో పొత్తు కలుపుతోంది అని భీమవరం లో జరిగిన పార్టీ సమావేశంలో చెప్పకనే చెప్పేశారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని కూటమిలోకి ఆహ్వానించడానికి తాను ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డానో ఎన్ని రకాలుగా చీవాట్లు తిన్నానో మీకు తెలియదు అంటూ పవన్ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చేశారు.

ఈ స్టేట్మెంట్ తో టీడీపీ ఇరకాటంలో పడింది. ఒక విధంగా ఆ పార్టీ ఇమేజ్ కి కూడా డ్యామేజ్ చేసేలా ఉందని ప్రచారం సాగింది. ఏపీలో టీడీపీతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటూంటే పవన్ తాను గా పూనుకుని మరీ పొత్తులు కుదిర్చినట్లుగా ఆయన స్టేట్మెంట్ ఉంది. అంటే టీడీపీ నలభై శాతం ఓటు షేర్ ఉన్న పార్టీ, అనేక సార్లు అధికారంలో ఉన్న పార్టీ, ముమ్మారు సీఎం అయిన చంద్రబాబు అనుభవశాలి అయిన నేతగా ఉన్న చోట అర శాతం ఓటు షేర్ కలిగిన బీజేపీ పొత్తులకు ఎందుకు వ్యతిరేకంగా ఉందో అన్న ఆలోచనలు అయితే జనంలోకి వచ్చాయి.

దీంతో డ్యామేజ్ కంట్రోల్ అన్నట్లుగా ఇపుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు అని అంటున్నారు. అదేంటి అంటే ఎన్డీయేలోకి చేరమని బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి టీడీపీకి ఆహ్వానం వచ్చిందని. అంటే బీజేపీ పెద్దలే టీడీపీతో మైత్రి కోసం చూస్తున్నారు అని ఆ విధంగా రాజమార్గంలోనే బీజేపీ టీడీపీకి స్నేహ హస్తం అందించి పొత్తులకు రాచబాట వేసింది అన్నది అచ్చెన్న తాజా ప్రకటన సారాంశం అని అంటున్నారు.

తమకు ఎన్డీయేలో చేరమని ఆహ్వానం వస్తేనే ఆ అంశం మీద మాట్లాడేందుకు చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లారు అని అచ్చెన్నాయుడు వివరించే ప్రయత్నం చేశారు. ఇక టీడీపీ జనసేనల మధ్య ఇప్పటికే పూర్తి అవగాహన కుదిరింది అని ఆయన చెప్పడం విశేషం. అన్ని అంశాల మీద తొందరలోనే స్పష్టత వస్తుందని అంటున్నారు.

ఇలా బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిందని అలాగే జనసేనతో ఇప్పటికే అవగాహన ఉందని అచ్చెన్నాయుడు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ మూడు పార్టీలు రానున్న ఎన్నికల్లో కలసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. అంటే 2014 పొత్తు రిపీట్ అవుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News