ఏపీ బీజేపీ పగ్గాలు రెడ్డి చేతికి ఖాయమా ?!
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పదవీకాలం త్వరలో ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో తరువాత ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారు ? అన్న ఆసక్తికర చర్చ నడుస్తున్నది. కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వ, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఉన్న నేపథ్యంలో ఈ పదవి ప్రస్తుతం కీలకంగా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ మంది అధ్యక్షులు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉండేది. ఆంధ్ర, తెలంగాణ విభజన తర్వాత రాష్ట్ర అధ్యక్షులుగా రెండు సార్లు కమ్మ, రెండు సార్లు కాపు నేతలకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటి వరకు కోస్తా ప్రాంతానికి చెందిన వారికి అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈ సారి రాయలసీమ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధ్యక్ష్య పదవిని అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో 70 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ లో కుల సమీకరణాలు బాగా పనిచేస్తాయన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. ప్రస్తుతం ఏపీలో కమ్మలు టీడీపీ వైపున, కాపులు జనసేన వైపున, రెడ్లు వైసీపీ వైపున ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కీలకపాత్ర పోషించిన రెడ్లు ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీకి దూరం జరిగారు. ఈ నేపథ్యంలో బలమైన ఈ సామాజికవర్గాన్ని బీజేపీ వైపు లాగాలన్నది ఆ పార్టీ అధిష్టానం వ్యూహం.
ఏపీలో బీజేపీ బలపడాలంటే ఏదో ఒక సామాజికవర్గాన్ని అక్కున చేర్చుకోవాలని, అందుకే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం ఆలోచన అని అంటున్నారు. మరి ఈ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో వేచిచూడాలి.