లండన్ నుంచి గుంటూరుకి కిరణ్ మృతదేహం... తల్లితండ్రుల బాద వర్ణనాతీతం!

కొడుకు... చివరికి ఇలా విగత జీవిగా కనిపించేసరికి, కడసారి చూపు కూడా దక్కలేదన్న బాధతో తల్లితండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది

Update: 2023-07-29 06:27 GMT

ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన యువకుడి కలలు కల్లలయ్యాయి. విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదం రూపంలో ఏపీకి చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడు లండన్ లో జూన్‌ 26న మృతి చెందిన విషయం తెల్సిందే. ఈయన మృతదేహం తాజాగా స్వగ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

అవును... లండన్‌ ప్రమాదంలో మృతి చెందిన కిరణ్ మృతదేహం గుంటూరుకు చేరుకుంది. లండన్ లోని ప్రవాస భారతీయుల సహకారంతో విమానంలో కిరణ్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఇంటికి తీసుకొచ్చారు. ఆ యువకుడు విదేశాలకు వెళ్లి సుమారు రెండున్నరేళ్లయింది.

సక్సెస్ ఫుల్ గా తాను అనుకున్నది సాధించి ఇంటికి వస్తాడనుకున్న కొడుకు... చివరికి ఇలా విగత జీవిగా కనిపించేసరికి, కడసారి చూపు కూడా దక్కలేదన్న బాధతో తల్లితండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. కొడుకు భౌతికకాయాన్ని చూసిన తల్లి... "లేవరా నాయనా" అని, తండ్రి... "కిరణ్ లేవరా" అని పిలిచి పిలిచి అలసిపోయారు.

ఇలా గుండెలు బాదుకుంటూ గొంతులు తడారేలా రోదిస్తోన్న కిరణ్ తల్లిదండ్రులను ఓదార్చడానికి స్థానికులు ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయారు. వారి మనోవేదనను, కన్నీటిని ఆపడం ఎవరివల్లా కాలేదు. ఆ దృశ్యాన్ని చూసి స్నేహితులు కంటతడి పెట్టారు. దీంతో స్థానికంగా పూర్తిగా విషాద చాయలు అలుముకున్నాయి.

కాగా... గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని గొడవర్రు గ్రామానికి చెందిన ఆరాధ్యుల కిరణ్‌.. ఏలూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటేక్ పూర్తిచేశాడు. అనంతరం ఎంఎస్‌ చదవడానికి లండన్‌ వెళ్లాడు. ఈ క్రమంలో... తాజాగా రోడ్డు ప్రమాదానికి గురై జూన్‌ 26న మృతి చెందిన విషయం తెల్సిందే.

అయితే బీటెక్ పూర్తయిన అనంతరం హైదరాబాద్‌ లో ఉండి ఏడాది పాటు ఓ కంపెనీలో పని చేసిన కిరణ్... కొంత ఆదాయ వనరులు సమకూర్చుకున్న అనంతరం లండన్‌ లో ఎంఎస్‌ చేస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీనికి వారు అంగీకరించారు. రెండున్నరేళ్ల క్రితం చివరి సారిగా అమ్మానాన్నల ఆశీస్సులు తీసుకుని లండన్‌ కు వెళ్లాడు. ఇప్పుడు ఇలా తిరిగి వారికి కనిపించాడు.

అన్నీ తెలిసి మౌనంగా... తండ్రి బాధ వర్ణనాతీతం:

రోడ్డు ప్రమాదంలో కిరణ్‌ కు తీవ్ర గాయాలయ్యాయని లండన్‌ లోని అతని స్నేహితుల ద్వారా తండ్రి యజ్ఞనారాయణకు సమాచారం అందింది. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత కుమారుడు మృతి చెందాడనే పిడుగులాంటి వార్త వినిపించింది. దీంతో ఆ తండ్రి నిశ్చేష్టులయ్యారు.

ఇదే సమయంలో కొడుకు మృతదేహం స్వదేశానికి రావడానికి ఆటంకాలు ఎదురవడం, రోజుల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆయన ఈ విషయాన్ని భార్య భూలక్ష్మీకి కూడా చెప్పలేకపోయారు. మనోవేదనను తన గుండెల్లోనే అణచుకుని మౌనంగానే రోదించారు.

ఈ నేపథ్యంలో సరిగ్గా కిరణ్‌ మృతి చెందిన నెల తర్వాత మృతదేహం స్వదేశానికి వస్తుండడంతో అసలు విషయాన్ని భార్యకు, మిగతా కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కిరణ్ తల్లి గుండెలవిసేలా రోదించారు.

Tags:    

Similar News