బీఆర్ఎస్ కథ ముగిసింది.. కిషన్ రెడ్డికి అర్థమైంది ఇంతేనా?

తాము అధికారంలో ఉన్నప్పుడు.. ఓటరుకు చెప్పిన మాటల్ని మర్చిపోకూడదు.

Update: 2024-06-07 04:42 GMT

రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నవారు సైతం కొన్ని అంశాల్ని అర్థం చేసుకోవటంలో పొరపాట్లు చేస్తుంటారు. ప్రజల తీర్పును వారు చూసే వైనం.. వారి కోణంలోనే తప్పించి వాస్తవ కోణంలో చూడటం మిస్ అవుతారు. దీంతో.. వాస్తవానికి దూరంగా వారి ఆలోచనలు.. ఎత్తుగడలు ఉంటాయి. అదే వారిని తప్పుడు మార్గంలో పయనించేలా చేస్తుంది. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ లో ఉన్నారా కిషన్ రెడ్డి అంటే.. అవునని చెప్పాలి. తాజాగా వెల్లడైన లోక్ సభా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవని వైనం తెలిసిందే. ఇదేమీ అంచనా వేయలేనిది కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడైనప్పుడే ఎంపీ స్థానాల సాధన విషయంలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమవుతుందన్న అంచనాలు వెలువడ్డాయి.

రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే ఇందుకు కారణం. లోక్ సభ ఎన్నికలకు మూడు నెలల ముందే రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరటం.. సహజంగానే అధికార పార్టీకి ఉండే సానుకూలతలతో పాటు.. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరాలన్న ప్రజల తలంపు కారణంగా బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఎలాంటి ఎజెండా లేకుండాపోయింది. తాము అధికారంలో ఉన్నప్పుడు.. ఓటరుకు చెప్పిన మాటల్ని మర్చిపోకూడదు. ఓటరు ఎప్పుడూ అధికార పగ్గాలున్న పార్టీకే ఓటు వేయాలని.. లేదంటే వారి ఓటు మోరీలో వేసినట్లేనంటూ అదే పనిగా బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత.. ఓటరు ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయి కదా?

తమ ప్రయోజనం కోసం ఓటరు మైండ్ సెట్ ను మార్చిన గులాబీ నేతలకు.. ఇప్పుడు అదే మైండ్ సెట్ వారిని దారుణ పరిస్థితుల్ని పరిచయం చేసింది. దీనికి తోడు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. వారు ప్రజల తరఫున పోరాటం చేస్తారు? వారికున్న బలాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న ఓటరు వారికి ఓటుతో తమ సమాధానాన్ని చెప్పేశారు. అలా అని తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్లే. కారణం.. ఇప్పటికి బీఆర్ఎస్ ప్రజలకు ఒక ఆప్షన్ గా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తెలంగాణ గీతం..తెలంగాణ అధికార చిహ్నం మార్పు విషయంలో బీఆర్ఎస్ తన సత్తా చాటిన విషయాన్ని మర్చిపోకూడదు. ఈ కారణంతోనే అధికారం చేతిలో ఉన్నా రేవంత్ రెడ్డి.. అధికార చిహ్నం మార్పుల అంశాన్ని పక్కన పెట్టేశారు. ఒక రాజకీయ పార్టీకి ఎత్తుపల్లాలు సహజం. గెలిచినంతనే దానికి మించిన పార్టీ లేదని.. ఓడితే ఆ పార్టీ పని అయిపోయిందనుకోవటం సరికాదు. రాజకీయం కోసం నాలుగు మాటలు అనుకోవటం ఫర్లేదు. కానీ.. అదే పనిగా పార్టీ పని అయిపో్ందన్న మాట నోటి వెంట రావటం మంచిది కాదు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని పార్టీలు ఉండాలన్న ది మర్చిపోకూడదు. ఒక పార్టీ పని అయిపోయిందన్న మాటనే అహంకార ధోరణితో చెబితే.. తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్న విషయాన్ని కిషన్ రెడ్డి లాంటోళ్లు మర్చిపోకూడదు. తాజాగా వెల్లడైన సికింద్రాబాద్ ఎంపీ ఫలితాన్ని ఆయన అర్థం చేసుకొని ఉంటే ఆయనలా మాట్లాడే వారు కాదేమో? ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ యాభై వేల కంటే తక్కువ. తెలంగాణలో జరిగిన లోక్ సభా ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో విజయం సాధించిన ఎంపీల్లో కిషన్ రెడ్డి ముందుంటారు. తనకొచ్చిన తక్కువ ఓట్ల గురించి ఆలోచించటం మానేసి.. ఎదుట పార్టీ పని అయిపోయిందని.. షెడ్డుకు వెళ్లిపోయిందన్న మాటలతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుభూతి పెంచే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. ఇలాంటి మాటలు తమ పార్టీకి ఏ మాత్రం మేలు చేయమన్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తిస్తే మంచిది.

Tags:    

Similar News