అలా అయితే దేశంలో ప్రతీ ఇంటికి రాహుల్ వెళ్లాలి కిషన్ రెడ్డీజీ !

తెలంగాణాకు చెందిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తమ పార్టీ ద్వారా ఒక విచిత్రమైన ప్రోగ్రాం పెట్టించారు.

Update: 2024-08-01 03:36 GMT

తెలంగాణాకు చెందిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తమ పార్టీ ద్వారా ఒక విచిత్రమైన ప్రోగ్రాం పెట్టించారు. అదేంటి అంటే రైతుల మీద. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీని నిలబెట్టుకోలేదని కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అని ఆయన అంటున్నారు.

ఇచ్చిన హామీను అసలు నెరవేర్చలేదని దుయ్యబెడుతున్నారు. రెండు లక్షల రుణ మాఫీ రైతులు అందరికీ ఇస్తామని చెప్పి చాలా మందికి ఎగ్గొట్టిందని ఆయన ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. అలా తెలంగాణాలో రైతు రుణ మాఫీ రెండు లక్షల రూపాయలు అమలు కాని రైతులను అందరినీ బీజేపీ తరఫున తాము కలుస్తామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలోనూ బీజేపీ నేతలు పర్యటించి రుణ మాఫీ అందరి రైతులను పరామర్శిస్తారని ఆయన ప్రకటించారు. ఆయా రైతుల వివరాలు సేకరిస్తామని అంటున్నారు. ఇది తక్షణమే ప్రారంభించే కార్యక్రమమని చెప్పారు. ఇపుడు దీని మీదనే రాజకీయంగా చర్చ సాగుతోంది. కిషన్ రెడ్డి ఆర్భాటంగా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మీద సెటైర్లు కూడా పడుతున్నాయి.

ఇంతకీ కిషన్ రెడ్డి ఎదుర్కొంటున్న విమర్శలు ఏంటి అంటే కేంద్రంలో పదేళ్ళ క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా ఎన్నో హామీలు అప్పట్లో దేశ ప్రజలకు ఇచ్చిందని అంటున్నారు. వాటిని కనుక చూస్తే నల్లధనాన్ని విదేశాల నుంచి తెప్పించి దేశంలోని ప్రతీ కుటుంబానికి పది లక్షలు వంతున వారి ఖాతాలలో జమ చేస్తామని చాలా గంభీరమైన హామీనే ఇచ్చింది బీజేపీ.

మరి ఈ హామీ అసలు గుర్తు ఉందా అని అడుగుతున్నారు. మరి ఈ హామీ నెరవేర్చనందుకు రాహుల్ గాంధీ దేశంలోని ఎన్ని ఇళ్ళు తిరగాలో కిషన్ రెడ్డినే చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఏటా రెండు కోట్ల వంతున నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని కూడా మోడీ నాయకత్వంలోని బీజేపీ చెప్పింది. ఈ లెక్కన చూస్తే పదేళ్ళలో ఇరవై కోట్ల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇప్పటిదాకా ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని కూడా అడుగుతున్నారు.

మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ కాళ్ళు అరిగేలా దేశమంతా తిరగాల్సి ఉంటుంది కదా ఏకంగా ఈ దేశంలో ఉన్న యాభై కోట్లకు పైగా నిరుద్యోగుల వివరాలు సేకరించి బీజేపీ మీద రాజకీయ యుద్ధం ప్రకటించాలి కదా అని అంటున్నారు. వైద్యం విద్య విషయంలో పేదలకు అన్నీ అందేలా చూస్తామని ఆనాడు హామీ ఇచ్చింది. అలాగే పేదలు సంపన్నులకు మధ్య గ్యాప్ ని తగ్గిస్తామని బీజేపీ పేర్కొంది. మొత్తం దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చింది.

బ్యాంకులలో నిరర్దక ఆస్తులను తగ్గిస్తామని మరో పెద్ద హామీ ఇచ్చింది. మరి అది ఎంతవరకూ నిలబెట్టుకున్నారో చెప్పాలని కోరుతున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని కూడా హామీ ఇచ్చింది. వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని విధాలుగా వారి జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పిన హామీలు ఏమయ్యాయని కూడా నిలదీస్తున్నారు. ప్రతీ ఇంటికీ రక్షిత మంచి నీరు అందిస్తామని చెప్పారు. నదుల అనుసంధానం అని పెద్ద మాటలు ఎన్నో చెప్పారు.

ఇలా అనేక హామీలు ఇచ్చిన బీజేపీ ఎంతవరకు నెరవేర్చింది అని ప్రశ్నిస్తున్నారు. అలా నెరవేర్చని చోటకు రాహుల్ గాంధీ వెళ్ళి పర్యటిస్తే ఈ దేశమంతా అలుపెరగకుండా తిరగాల్సిందే అని అంటున్నారు. ముందు బీజేపీ ఇచ్చిన హామీలను కేంద్ర మంత్రిగా అమలు చేసేలా చూడమని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News