విజయశాంతిని పట్టించుకోని కిషన్‌రెడ్డి!
దీంతో విజయశాంతి ఏం చేసినా పార్టీలో పట్టించుకునే వాళ్లు లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ లో సీనియర్ నాయకురాలు విజయశాంతి. ప్రస్తుతం బీజేపీ లో ఉన్న ఆమె.. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్నారు. దీంతో తన అసంతృప్తి, అసహనాన్ని ఇటీవల ట్వీట్ల రూపం లో బయటపెట్టారు. మణిపూర్ ఘటన పై కేంద్రం లో ఉన్న బీజేపీ ని ఇరకాటం లో పెట్టేలా కూడా ట్వీట్ చేశారు. కానీ ఎంత చేసినా విజయశాంతి ని పార్టీలో పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరనే విషయం తాజాగా కిషన్‌రెడ్డి వ్యాఖ్యల తో స్పష్టమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. దీని కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో విజయశాంతి అసౌకర్యానికి గురైనట్లు తెలిసింది. తెలంగాణ ను వ్యతిరేకించిన కిరణ్‌కుమార్ ఉన్న వేదిక ను పంచుకోవడం ఇష్టం లేక మధ్యలోనే వెళ్లిపోయానని తర్వాత విజయశాంతి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మణిపూర్ ఘటన పై ఆమె స్పందించారు.
తాజాగా ఈ విషయం పై కిషన్ రెడ్డి స్పందించారు. కిరణ్‌కుమార్ రెడ్డి కూడా బీజేపీ నాయకుడేనని ఆయన అన్నారు. అలాంటప్పుడు కిరణ్‌కుమార్ ఉన్న వేదిక ను పంచుకోవడం పై విజయశాంతికి అభ్యంతరం ఏమిటో అర్థం కాలేదన్నట్లు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
అంతే కాకుండా విజయశాంతి చేసిన ట్వీట్లు చూడలేదని కూడా చెప్పారు. దీంతో విజయశాంతి ఏం చేసినా పార్టీలో పట్టించుకునే వాళ్లు లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లేలా కనిపిస్తున్నారనే ప్రచారం నిజమయ్యేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు.