వైసీపీ ఓటమిపై ఆ నేత విశ్లేషణ వేరే లెవెల్ !

ఇంకా ప్రజలు తమ వైపే అంటున్నారు. ఏదో ఎక్కడో లోపం జరిగింది అని కూడా అంటున్నారు.

Update: 2024-06-06 12:30 GMT

వైసీపీ ఓటమి పాలు అయింది. ఎందుకు అంటే ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. చాలా మంది అయితే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మంచి చేసింది అని ప్రజలే వైసీపీని ఓడించారు అని. జనం చేతిలో మోసపోయిన నాయకుడు అని జగన్ మీద సానుభూతితో సోషల్ మీడియాలో చాలా మంది వైసీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

ఇంకా ప్రజలు తమ వైపే అంటున్నారు. ఏదో ఎక్కడో లోపం జరిగింది అని కూడా అంటున్నారు. కానీ తమ ఘోర ఓటమిని నిజాయతీగా మాత్రం విశ్లేషించుకోలేకపోతున్నారు. వాస్తవంగా చూస్తే ప్రజల నాడిని అంచనా వేయడంతో వైసీపీ విఫలం అయింది అని అంటున్నారు.

వైసీపీ నేతలు మొత్తం భ్రమలలో బతికారు అని అంటున్నారు. అది కూడా ఎంతలా అంటే ఏకంగా వైసీపీ అధినేత జగన్ ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు అనేంటంతగా. ఆయన పార్టీ ఓడిన రోజు మీడియా ముందుకు వచ్చిన తరువాత ఎన్నో పధకాలు ఇచ్చాం కానీ ప్రజలు ఎందుకు ఓడించారు అని ప్రశ్నించారు.

వాస్తవానికి వైసీపీ ధీమా చూస్తే ఓవర్ గా ఉంది అనే అంటున్నారు. ఎన్నికల ఫలితాలు రాక ముందే విశాఖలో ప్రమాణ స్వీకార ముహూర్తాలు హడావుడి చేస్తూ పోయారు. ఇలా ఎక్కడా తగ్గకుండా తమ గెలుపు ఖాయమనుకుని వారంతా ఆకాశంలో ఊగారు. దాంతో ఫలితాలు తేడా కొట్టడంతో షాక్ కి గురి అయ్యారు.

దీని మీద విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని కానీ ప్రజల నడిని పసిగట్టడంతో తాను కూడా ఫెయిల్ అయ్యాను అన్నారు. ప్రజలు ఎక్కడా తమ ఇబ్బందులు కనబడీయకుండా చేశారని అన్నారు. తమ మనసులో ఏముందో తెలియనీయలేదని అన్నారు. ఒక విధంగా వైసీపీని ఏమార్చారు అని ఆయన చెప్పారు.

ఎవరు ఏమి చెప్పినా తలూపిన ప్రజలు చివరికి తాము ఏమనుకుంటున్నామో అదే చేసి చూపించారు అన్నారు. తుచ తప్పకుండా ప్రజలు తమ మనసులో ఉన్నది అమలు చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నారు. తాను రకరకాలైన ప్రభంజనాలు చూశాను కానీ ఏపీలో వచ్చిన ప్రభంజనం మాత్రం చూడలేదని అన్నారు.

ఒక విధంగా ప్రజలు షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నట్లుగానే కేకే రాజు మాట్లాడారు. ఆయన అన్నారు అని కాదు కానీ ఏపీలో వైసీపీకి నిజంగా ప్రజలు చాలా దారుణంగా ఓడించారు. ఎక్కడ 151 సీట్లు, మరెక్కడ 11 సీట్లు అన్నట్లుగానే ఉంది. పదకొండు సీట్లకే వైసీపీని పరిమితం చేయడం ద్వారా వైసీపీని ఘోరమైన అవమానానికి గురి చేశారు. దీనిని తేరుకుని వైసీపీ ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News