ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు కానీ... కోడికత్తి శ్రీను క్లారిటీ!
వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాస రావు (కోడికత్తి శ్రీను).. తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు
వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాస రావు (కోడికత్తి శ్రీను).. తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. కోడికత్తి శ్రీను రాజకీయాల్లోకి వస్తున్నారని.. ఇప్పటికే జైభీమ్ భారత్ పార్టీలో చేరారని.. అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో... తాను ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదని శ్రీను స్పష్టం చేశారు.
అవును... వైఎస్ జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడిచేసిన కేసులో నిందితుడిగా జైల్లో ఉండి.. ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు కోడికత్తి శ్రీను. ఈ సమయంలో... రానున్న ఎన్నికల్లో శ్రీను పోటీ చేస్తారని.. దీని కోసం అమలాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని వస్తున్న కథనాలపై స్పందించారు. తాను ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తనపై వస్తున్న రూమర్స్ ని నమ్మొద్దని.. తనకు సంబంధించిన ఏ విషయమైనా తానే నేరుగా ప్రజల ముందుకు వచ్చి చెబుతానని తెలిపారు. ఇదే సమయంలో తాను ఇంకా ఏపార్టీలోనూ చేరలేదని.. ప్రధాన పార్టీలు తనను ఆహ్వానించి, టిక్కెట్ ఇస్తే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అలా కానిపక్షంలో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు.
ఇందులో భాగంగా అమలాపురం అసెంబ్లీ, పార్లమెంట్ రెండింటికీ తాను పోటీ చేస్తానని కోడికత్తి శ్రీను స్పష్టం చేశారు! ఇక తనపై ప్రజలు ఎంతో ఆదరణ, సానుభూతి చూపిస్తున్నారని.. చట్టసభల్లో ప్రజల తరుపున గొంతు వినిపించాలని కోరుకుంటున్నానని తెలిపారు. న్యాయం అందరికీ అందేలా చూస్తానని వెల్లడించారు. తానుపడ్డ కష్టాలు ప్రజలు ఎవ్వరూ అనుభవించకుండా చూస్తానని చెప్పుకొచ్చారు.
ఇక తాను జైల్లో ఉన్న సమయంలో డిగ్రీతో పాటు ఐదు వేల పుస్తకాలు చదివినట్లు తెలిపిన కోడికత్తి శ్రీను... సమాజాన్ని కూడ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. ప్రజలు పడుతున్న సమస్యలనుంచి వారిని ఎలా బయటకు తీసుకురావాలనే విషయంపై తనకు అవగాహన ఉందని వెల్లడించారు.
కాగా... జనిపల్లి శ్రీనివాస రావు జైభీమ్ భారత్ పార్టీలో చేరారని.. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారని.. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాను ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదని శ్రీను స్పందించారు.