వారిని తిట్టలేదనే టికెట్ ఇచ్చి ఉండరు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్ సభా స్థానానికి ఆయన అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు పోయాయి. ఇలాంటివారిలో ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో రక్షణనిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తిరువూరు సీటు ఇవ్వకపోవడంతో మనసు గాయపడిందని తెలిపారు. ఒక ఎంపీ చెప్పిన మాట విని రెండుసార్లు గెలిచిన తనకు సీటు లేకుండా చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన నిర్ణయం ఏమిటో రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడించారు.
ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని.. ఎక్కడి నుంచి అనేది త్వరలోనే తెలియజేస్తానని రక్షణనిధి తెలిపారు. గత పదేళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లను తాను ఎప్పుడూ తిట్టలేదన్నారు. అందుకే తనకు ఇప్పుడు టికెట్ నిరాకరించడానికి ఇది ఒక కారణమై ఉండొచ్చన్నారు.
ఒక ఎంపీ కండీషన్ తోనే నల్లగట్ల స్వామిదాసుకు తిరువూరు సీటు ఇచ్చారని రక్షణనిధి మండిపడ్డారు. తాను వైసీపీ అధిష్టానం వద్దకు వెళ్లనని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు.
కాగా తిరువూరు నుంచి రక్షణనిధి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ సృష్టించాలని ఆయన భావించారు. అయితే జగన్ సీటు నిరాకరించి రక్షణనిధి ఆశలకు గండికొట్టారు.
తిరువూరు నుంచి తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నల్లగట్ల స్వామిదాసుకు జగన్ సీటు కేటాయించారు. నల్లగట్ల స్వామిదాసు విజయవాడ ఎంపీ కేశినేని నానికి సన్నిహితుడు. ఇటీవల కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే నల్లగట్ల కూడా వైఎస్ జగన్ సమక్షంతో తన భార్య సుధారాణితో కలిసి వైసీపీలో చేరిపోయారు.
కాగా తాజాగా వైసీపీ టికెట్ దక్కించుకున్న నల్లగట్ల స్వామిదాసు 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా తిరువూరు నుంచి గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు రంగారావు చేతిలో ఓడిపోయారు. 2009లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దిరిశం పద్మజ్యోతి చేతిలో కేవలం 265 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లోనూ వైసీపీ అభ్యర్థి రక్షణనిధి చేతిలో నల్లగట్ల స్వామిదాస్ 1676 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2019లో ఆయనకు టీడీపీ సీటు ఇవ్వలేదు. నాడు మంత్రిగా ఉన్న జవహర్ ను తిరువూరు నుంచి బరిలోకి దింపింది.