మళ్లీ ఏసేశాడు.. కొలికపూడి!
ఒక వివాదం తెరమీదికి వచ్చినప్పుడు.. అన్ని రకాలుగా జనాలు ఏకేస్తున్నప్పుడు.. ఎవరైనా జాగ్రత్త పడతారు.
ఒక వివాదం తెరమీదికి వచ్చినప్పుడు.. అన్ని రకాలుగా జనాలు ఏకేస్తున్నప్పుడు.. ఎవరైనా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబే ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత.. అంతో ఇంతో మారేందుకు ప్రయత్నిస్తారు. కానీ, తిరువూరు నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం ఏమాత్రం మారడం లేదు. పైగా రోజుకో కొత్త వివాదంతో ఆయన తెరమీదికి వస్తున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని ఆరు మాసాలు కూడా కాలేదు.
కానీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారికంటే కూడా ఎక్కువగా వివాదాలు తెచ్చుకుంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి.. అన్నట్టుగా ఆయన ఏరికోరి వివాదాలు చేస్తూనే ఉన్నారు. కేవలం వారం వ్యవధిలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న జర్నలిస్టులను లం.. కొడుకులు అంటూ.. నోరు చేసుకున్నారు. ఈ కేసు చంద్రబాబు వరకు వెళ్లింది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక ఆయన ఇబ్బందులు పడుతున్నారు.
ఆ తర్వాత రెండు రోజులకే.. మహిళలకు అసభ్య సందేశాలు పంపించారంటూ.. తిరువూరు మహిళలు ధర్నాకు దిగారు. మంగళవారం రోజు రోజంతా మహిళలు ఆందోళనలు చేశారు. ఈ వివాదం నుంచి ఇంకా బయటకు రాకముందే.. ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు రైతుల పక్షాన ఉంటే.. వారినే టార్గెట్ చేసుకుని కొలికపూడి వివాదాలకు దారితీసేలా వ్యాఖ్యలు సంధించా రు. ఆయన రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
``కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా.. రైతులకు లేదు!`` అని కొలిక పూడి నోరు పారేసుకున్నారు. దీనిపై రైతు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పోనీ.. కొలికపూడి ఏమైనా కారణంతో ఈ వ్యాఖ్యలు చేశాడా? అంటే.. అది కూడా లేదు. ఆయన చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రైతులు మద్దతు పలకలేదన్న అక్కసుతోనే రైతులను కుక్కలతో పోల్చారంటూ.. అన్నదాతలు ఆందోళనలకు దిగారు. ప్రస్తుతం కొలికపూడి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటి నుంచి ఆయన బయటపడినా.. పార్టీకి మాత్రం ఇలాంటి వారితో చెడ్డపేరు ఖాయమనే వాదన వినిపిస్తోంది.