కేరళ గవర్నర్‌గా టీడీపీ మాజీ ఎంపీ... బాబు సూపర్ హిట్టు...!
చంద్రబాబు మాటే శిరోధార్యం అన్న ట్టుగా నడుచుకుంటారు. ఆయనే మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.
ఆయన చంద్రబాబు మాట జవదాటరు. కూర్చో అంటే కూర్చుంటారు. నిలబడమంటే నిలబడతారు. సీనియర్ నాయకుడే అయినా..ఎక్కడా ఆధిపత్య రాజకీయం చేయరు. చంద్రబాబు మాటే శిరోధార్యం అన్న ట్టుగా నడుచుకుంటారు. ఆయనే మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో నువ్వు తప్పుకో.. వేరేవారికి సీటు ఇస్తున్నా! అనగానే వెంటనే ఎలాంటి చర్చా పెట్టకుండానే ఆయన తప్పుకొన్నారు.
ఆ వెంటనే మచిలీపట్నం సీటును చంద్రబాబు జనసేనకు కేటాయించారు. ఈ విషయాన్ని అప్పట్లో చంద్రబాబే స్వయంగా చెప్పారు. ''నేను తప్పుకోమనగానే కొనకళ్ల నారాయణ వెంటనే తప్పుకొన్నారు. నాకు ఏం చేస్తారు? నా ఫ్యూచర్ ఏంటి? అని కూడా ఆయన అడగలేదు. ఇలాంటివారికి తప్పకుండా న్యాయం చేస్తాం'' అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరికొందరు నాయకులు తప్పుకొన్నా.. వారు ముందుగానే బేరసారాలకు దిగారు.
కానీ, వారితోపోల్చుకుంటే.. నారాయణ చాలా బెటర్ అని చంద్రబాబు భావించారు. పన్నెత్తు మాట కూడా ఎదురు చెప్పకుండానే ఆయన తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు నారాయణకు వరమాల సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరదలు, వర్షాలు తగ్గగానే ఆయనకు తీపి కబురు అందించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. కొనకళ్ల నారాయణకు గవర్నర్ పదవికి సిఫారసు చేసేందుకు చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే నెలలో 5 రాష్ట్రాల్లో గవర్నర్‌లను మార్చనున్నారు. ఆయా రాష్ట్రాల్లో రెండు దక్షిణాదిలోనే ఉన్నాయి. ప్రధానంగా కేరళలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రానికి కొనకళ్లను పంపించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు చాలా ఉత్సాహంగా ఉన్నారని.. కొనకళ్ల వంటివారికి న్యాయం చేయడం ద్వారా.. సీనియర్లకు సరైన సందేశాలు ఇవ్వాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలిసింది. అయితే.. దీనికి కొంత సమయం అయితే పట్టనుందని చెబుతున్నారు.