ఆ మాజీ మంత్రి లక్కీ అంటున్నారు !
అవును ఆయన లక్కీ అనే అంటున్నారు. ఆయన రాజకీయం మొదట్లోనే లక్ అలా పలకరించి ఆయన్ని ఎంపీ చేసింది.
అవును ఆయన లక్కీ అనే అంటున్నారు. ఆయన రాజకీయం మొదట్లోనే లక్ అలా పలకరించి ఆయన్ని ఎంపీ చేసింది. ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. కొణతాల 1989లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన యువకుడుగా ఉంటూ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడమే కాదు అప్పటికి దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగి అనకాపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పెతకంశెట్టి అప్పలనరసింహాన్ని కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో ఓడించారు.
అలా ఆయన గిన్నీస్ రికార్డుకు ఎక్కారు. పార్లమెంట్ లో అడుగు పెట్టారు. 1991లో కూడా ఆయన మరోసారి గెలిచారు. అలా ఏడేళ్ల పాటు ఆయన ఎంపీగా ఉన్నారు. మరో రెండు సార్లు ఓటమి పాలు అయ్యారు. ఇక అంతే అనుకుంటే 2004లో వైఎస్సార్ వేవ్ లో ఆయన అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైఎస్సార్ సీఎం కావడంతో కొణతాల ఉమ్మడి విశాఖకు అయిదేళ్ల పాటు ఏకైక మంత్రిగా ఏలారు. అలా ఆయన కీలక మంత్రిత్వ శాఖలను చూసారు. పట్టు సాధించారు.
కానీ 2009లో ఆయన ఓటమి పాలు అయ్యారు. వైఎస్సార్ జీవించి ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చి అయినా మంత్రిని చేసేవారు. అది ఆయనకు బ్యాడ్ లక్ అయింది. అలా వైసీపీ టీడీపీలలో తిరిగి కొన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసిన కొణతాల రాజకీయం ముగిసినట్లే అని అంతా అనుకుంటున్న వేళ 2024 ఎన్నికల్లో ఆయన మళ్లీ మెరిసారు.
జనసేనలో చేరి అనకాపల్లి టికెట్ సాధించారు. ఇపుడు వస్తున్న పోస్ట్ పోల్ అంచనాలు చూస్తే కొణతాల మంచి మెజారిటీతో గెలుస్తారు అని అంటున్నారు. అంతే కాదు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కొణతాల మంత్రి కావడం ఖాయమని అంటున్నారు. మరి అదే జరిగితే ఆయనను మించిన రాజకీయ అదృష్టవంతుడు వేరే వారు ఉండరని అంటున్నారు.
మంచి వారిగా అవినీతి మరక లేని నేతగా పేరు తెచ్చుకున్న కొణతాలకు ఇది రాజకీయంగా చివరి అవకాశంగానే చూడాలి. ఈసారి ఆయన మంత్రి అయితే చాలా సంతృప్తికరమైన రాజకీయ జీవితంతో కెరీర్ ని ముగిస్తారు అని అంటున్నారు. ఆయన ఉత్తరాంధ్రా సమస్యల మీద పూర్తిగా అవగాహనతో పనిచేస్తానని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కి కూడా ఆయన మీద గురి ఉంది. చంద్రబాబు సైతం కొణతాలను విశ్వసిస్తారు. దాంతో కూటమి గెలిస్తే రెండవ మాట లేకుండా కొణతాలే మినిస్టర్ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.