కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ షాక్.. రాజీనామా తప్పదా..?

అటు.. నాగార్జున ఫ్యామిలీ కూడా సురేఖ వ్యాఖ్యలకు చాలావరకు సీరియస్‌గా తీసుకున్నారు. నాగార్జున భార్య అమల సైతం సురేఖపై భగ్గుమన్నారు.

Update: 2024-10-05 07:16 GMT

మాజీమంత్రి కేటీఆర్‌ను టార్గెట్ పోయి నాగార్జున ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడిందా..? చివరకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా..? ఇప్పటికే హైకమాండ్ నుంచి సురేఖకు ఆదేశాలు అందాయా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కేటీఆర్‌పై కొండా సురేఖ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను టార్గెట్ చేస్తూ.. సినీనటులు నాగచైతన్య-సమంత విడాకులపైనా ఆమె కామెంట్స్ చేశారు. వారిద్దరు విడిపోవడానికి కారణం కేటీఆరే అనే పెద్ద బాంబ్ పేల్చారు. తన ఎన్ కన్వెన్షన్ కాపాడుకునేందుకు సమంతను కేటీఆర్ కోరినట్లుగా ఆరోపణలు చేశారు. మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరును సైతం ప్రస్తవించారు. అయితే.. సురేఖ ఆరోపణలపై సినీలోకం సైతం భగ్గుమంది. సురేఖ వ్యాఖ్యలను సినీప్రముఖులు తీవ్రంగా ఖండించారు. చివరకు ఈ అంశం జాతీయ స్థాయి వరకూ చేరింది. సినీ పరిశ్రమకు చెందిన నటులు చివరకు రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు.. నాగార్జున ఫ్యామిలీ కూడా సురేఖ వ్యాఖ్యలకు చాలావరకు సీరియస్‌గా తీసుకున్నారు. నాగార్జున భార్య అమల సైతం సురేఖపై భగ్గుమన్నారు.

నాగార్జున సైతం సురేఖపై పరువు నష్టం దావా వేశారు. నోటీసులు పంపించారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ ఫ్యామిలీ ఇమేజ్‌కు డ్యామేజీ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అటు పార్టీ తరఫున కూడా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే సినీ పరిశ్రమకు ఓ అప్పీల్ చేశారు. మంత్రి క్షమాపణలు కోరారని.. ఇకనైనా ఈ విషయాన్ని వదిలిపెట్టాలని సూచించారు.

కానీ.. ఈ విషయంలో మాత్రం నాగార్జున ఫ్యామిలీ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. నాగార్జున భార్య అమలకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో అమల ప్రియాంకగాంధీతో ఈ విషయమై మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో గాంధీ ఫ్యామిలీ జోక్యం చేసుకోవాలని కోరింది. దాంతో సురేఖపై చర్యలు తీసుకుంటామని అమలకు హామీ ఇచ్చినట్లుగా తెలసింది. అందుకే.. సురేఖను తప్పించకుండా.. తనంతట తానే రాజీనామా చేయాలని సూచించాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. సురేకను పదవి నుంచి తొలగిస్తే విమర్శలు వచ్చే అవకాశాలు ఉండడంతో.. సొంతంగా రాజీనామా చేసేలా ఒప్పించాలని టీపీసీసీకి సూచించినట్లు తెలిసింది.

ఇప్పటికే సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లుగా టీపీసీసీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా అక్కడి నాయకత్వం ససేమిరా అన్నట్లు సమాచారం. సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒకటి రెండు రోజుల్లోనే పార్టీ పెద్దలు ఆమెతో రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News