భార్య మీద 72 మంది చేత రేప్ చేయించిన కేసులో సంచలనం

ఒక భర్త తన భార్య మీద 72 మంది చేత రేప్ చేయించటమా? అది కూడా డెబ్భైఏళ్ల ముదిమి వయసులో.

Update: 2024-10-05 06:45 GMT

ఒక భర్త తన భార్య మీద 72 మంది చేత రేప్ చేయించటమా? అది కూడా డెబ్భైఏళ్ల ముదిమి వయసులో. ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనంతో పాటు షాక్ కు గురి చేసిన ఈ ఉదంతానికి సంబంధించి తాజాగా ఫ్రాన్స్ న్యాయస్థానం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భర్త రూపంలో ఉన్న ఈ శాడిస్ట్ పిశాచి ఉదంతం గురించి తెలిసినంతనే చాలామందికి కరెంటు షాక్ కొట్టినట్లుగా మారిన పరిస్థితి.

ఈ కేసు వివరాల్లోకి వెళితే ఫ్రాన్సులోని ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పని చేసే 71 ఏళ్ల నిందితుడు.. తన భార్యపై కొన్నేళ్ల పాటు అత్యంత పాశవికంగా ప్రవర్తించటం తెలిసిందే. రాత్రి వేళలో ఆమె తినే ఫుడ్ లో రహస్యంగా డ్రగ్స్ కలిపిన ఫుడ్ ను తినిపించేవాడు. ఆమె మత్తులో జారుకున్న తర్వాత కొంతమంది వ్యక్తుల్ని తన ఇంటికి పిలిపించి.. ఆమెపై లైంగిక దాడులకు పాల్పడేలా చేసేవారు. అదంతా రహస్య కెమరాల్లో రికార్డు చేసేవాడు.

దాదాపు పదేళ్ల పాటు సాగిన ఈ ఆరాచక కాండకు ముగింపుగా ఇతగాడి విపరీత ధోరణి పోలీసులు పట్టుకునేలా చేసింది. 202లో ఒక షాపింగ్ సెంటర్ లో కొందరు మహిళల్ని రహస్యంగా వీడియోలు తీస్తున్న విషయాన్ని సెక్యూరిటీ గార్డు గుర్తించి పట్టుకోవటం.. పోలీసు విచారణలో అతడి ఫోన్.. కంప్యూటర్ ను తనిఖీ చేయగా.. అసలు ఘోరం వెలుగు చూసింది. మొత్తం 72 మందితో 92సార్లు భార్యపై అత్యాచారం చేయించిన ఈ ఉదంతం గురించి తెలిసిన వేళ.. పోలీసులు సైతం షాక్ తిన్నారు. భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల వయసున్న వ్యక్తుల్ని ఇంటికి పిలిపించి మరీ రేప్ చేయించేవాడు.

ఇప్పటికే ఈ కేసులో బాధితురాలుగా ఉన్న మహిళ.. ఈ కేసు విచారణను బహిరంగంగా చేపట్టాలని.. తన వివరాల్ని ప్రపంచానికి వెల్లడించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించటం తెలిసిందే. పదేళ్లు తనకు తెలీకుండానే తనపై దారుణాలు జరగటాన్ని జీర్ణించుకోలేని ఆమె.. ఇలాంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధితురాలి పిల్లలు సైతం ఆమెకు అండగా నిలిచారు.

ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం కూడా మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. అత్యంత అరుదైన ఈ కేసు విచారణ సందర్భంగా ఆధారాలు.. సాక్ష్యాల్లో భాగంగా వీడియోలను ప్రదర్శిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న వ్యక్తులు కూడా వీటిని చూసే అవకాశం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ వీడియోలు ప్రదర్శించే సమయంలో సున్నిత మనస్కులు.. మైనర్లు కోర్టు పరిసరాల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. వాస్తవాల్ని వెలికి తీసే క్రమంలో కచ్చితంగా అవసరమైన వీడియోలను మాత్రమే ప్రదర్శించనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి శిక్షను ఫ్రాన్స్ కోర్టులు విధిస్తాయన్నది యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News