టైం మిషిన్ పిచ్చ.. ఏకంగా రూ.35 కోట్లు దోచేశారు
ఎదుటి వారి ఆసక్తులు.. వారి బలహీనతల్ని అసరాగా చేసుకొని దోచేసుకునే బ్యాచ్ ఇటీవల కాలంలో ఎక్కువైపోయారు
ఎదుటి వారి ఆసక్తులు.. వారి బలహీనతల్ని అసరాగా చేసుకొని దోచేసుకునే బ్యాచ్ ఇటీవల కాలంలో ఎక్కువైపోయారు. బాగా చదువుకున్నప్పటికీ మోసగాళ్ల చేతిలో ఇట్టే మోసపోయే వారి ఉదంతాలు విన్నప్పుడు విస్మయానికి గురి చేస్తూ ఉంటాయి. ఇంతలా ఎలా మోసపోతారు? అన్న భావన కలుగుతుంది. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. టైం మిషన్ పేరు చెప్పిన ఒక జంటకు టోకరా వేయటమే కాదు.. ఏకంగా రూ.35 కోట్లు కొల్లగొట్టిన వైనం షాకిచ్చేలా మారింది. అదెలా సాధ్యమైందన్న విషయంలోకి వెళితే..
కాన్పూరుకు చెందిన ఒక జంట (రాజీవ్ కుమార్ దూబే, రష్మీ దూబే) రివైవల్ థెరపీ పేరుతో ఒక సెంటర్ ను ప్రారంభించారు. ఇందులో హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరఫీని టైం మిషీన్ ద్వారా అందిస్తామని నమ్మబలికారు. తమ మెషీన్ తో వయసును తగ్గించటమే కాదు.. యవ్వనాన్ని తిరిగి కోరుకునే వారికి అందిస్తామని మాయమాటలుచెప్పారు. అంతేకాదు కాన్పూరు ప్రజలు కలుషితమైన గాలితో వృద్ధాప్యం బారిన పడుతున్నట్లుగా పేర్కొంటూ.. తమ వద్దనున్న టైం మెషీన్ తో 65 ఏళ్ల వయస్కుల్ని పాతికేళ్ల వారిగా మార్చేస్తామంటూ ప్రచారం చేపట్టారు.
ఇక్కడితో ఆగని వారు దీనికి ప్యాకేజీలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి మాయమాటల్ని నమ్మిన రేణుసింగ్ అనే బాధితురాలు ఏకంగా రూ.7 లక్షలు మోసపోతే.. ఆమె మాదిరే పలువురు భారీ ఎత్తున మోసానికి గురైన విషయం బయటకు వచ్చింది. ఇప్పటివరకు పోలీసులకు అందిన ఫిర్యాదుల్ని చూస్తే.. రూ.35 కోట్ల మేర జనం దగ్గర డబ్బులు దోచేసిన ఈ జంట విదేశాలకు పారిపోవటం గమనార్హం. నిజంగానే టైం మెషీన్ ఉంటే మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగదా? దానికి సంబంధించిన వివరాలు ఉండవా? అవేమీ లేకుండా ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి లక్షలకు లక్షలు ఇచ్చేసే వైనం చూస్తే.. అంతలా ఎలా మోసపోతారన్న భావన కలుగకమానదు.