కేటీఆర్ చేతికి 'కారు' స్టీరింగ్..?
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) చరిత్రలో తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవకుండా సున్నాకు పరిమితమైంది.
ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారన్న పేరు సంగతేమో కానీ.. ఆ రేసులో అవినీతి జరిగిందంటూ కేసును ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో ప్రభుత్వం ఉన్న దాదాపు పదేళ్లు కేటీఆర్ మాట బాగా చెల్లింది. అయితే, అధికారం ఎప్పటికీ శాశ్వత కాదు కదా..? 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది. అప్పటినుంచి కేసీఆర్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి.
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) చరిత్రలో తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవకుండా సున్నాకు పరిమితమైంది. దీనికితోడు పార్టీ నుంచి గెలిచిన 37 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది వరకు కాంగ్రెస్ లో కి జంప్ అయ్యారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం స్కాంలో తిహాడ్ జైలుకు వెళ్లారు. బీఆర్ఎస్ కు ఈ కష్టాలకు తోడు కేటీఆర్ పై ‘కారు’ కేసు నమోదైంది.
పార్టీ, నాయకత్వం పరంగా ఇంత జరుగుతున్నా అధినేత కేసీఆర్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఫాం హౌజ్ నుంచే ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారా? అన్నది కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అంతా తానే అయి భారం మోస్తున్నారు.
ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్తున్న కేటీఆర్.. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. మరోవైపు పార్టీ పరంగానూ ఆయన పాత్ర ప్రస్తుతం చర్చనీయం అవుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ చేతికి రానున్నట్లు తెలుస్తోంది.
పార్టీ తరఫున ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కేటీఆర్ చేతుల మీదుగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని సైతం ఆయన గట్టిగా నిలదీస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణల మీద కూడా సమర్థంగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా గత మూడు నెలల్లో జరిగిన పరిణామాలు కేటీఆర్ గ్రాఫ్ ను పెంచాయని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆయన చుట్టూ.. పార్టీ పగ్గాల అప్పగింత చర్చ జోరుగా సాగుతోంది.
ఇదివరకు పార్టీ చీఫ్ గా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు హరీశ్ రావు ముందుగా వినిపించేది. ఆయన ఉద్యమ నేపథ్యం, నాయకత్వ శైలిని దీనికి సపోర్టింగ్ గా చూపేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా కేటీఆర్ వైపు మొగ్గినట్లు బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. హైడ్రా, ఫార్ములా ఈ-రేస్ వంటి విషయాల్లో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి నువ్వానేనా అన్నట్లు దూకుడు చూపారు. ఇదే కేటీఆర్ కు మేలు చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయనకే పార్టీ పగ్గాలు దక్కుతాయని నిజామాబాద్ కు చెందిన కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
ఆ పండుగ నాటికి..
కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చింది దసరా నాడు. దాని ఫలితం ఎలా ఉన్నా.. ఆయన పార్టీ పగ్గాలను వచ్చే దసరా నాటికి కేటీఆర్ కు అప్పగిస్తారని అంటున్నారు. పైగా తెలంగాణలో దసరా పెద్ద పండుగ. సెంటిమెంట్ గానూ దీనిని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.