సవాళ్లు విసురుతున్నారు సరే.. మీ హయాంలో ఒక్కసారైనా స్పందించారా కేటీఆర్?
అధికారంలో ఉన్న వేళ.. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండటం.. ఏ విమర్శకు స్పందించకుండా ఉండటం కొందరు నేతలు చేస్తారు.
అధికారంలో ఉన్న వేళ.. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండటం.. ఏ విమర్శకు స్పందించకుండా ఉండటం కొందరు నేతలు చేస్తారు. తమ చేతి నుంచి అధికారం చేజారినంతనే ప్రతి విషయంలోనూ తప్పుల్ని.. లోపాల్ని ఎత్తి చూపుతుంటారు. తరచూ సవాళ్లను విసురుతూ ఉంటాను. ఇదంతా చదువుతున్నంతనే తెలంగాణరాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ చప్పున గుర్తుకు వస్తారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో తమపై వచ్చే విమర్శలకు.. ఆరోపణలకు.. సవాళ్లకు స్పందించిందే కనిపించదు.
అలాంటి కేటీఆర్ ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడటం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ పై నిత్యం ఏదో ఒక ఇష్యూలో విమర్శలు చేయటం.. తరచూ ఆయన పదవికి రాజీనామా చేయాలని సవాళ్లు విసరటం కనిపిస్తుంది. సవాళ్లు విసరటం తప్పు కాదు. అలాంటి సందర్భాల్లో పస ఉండాలే కానీ విన్నవారికి నస మాదిరి కనిపించకూడదు. కేటీఆర్ చేసే వ్యాఖ్యలు వింటే ఆయన ఆత్రుత ఇట్టే అర్థమవుతూ ఉంటుంది. అదే పెద్ద లోపంగా చెప్పాలి.
నారాయణపేట జిల్లా కోస్గిలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు నిరసన దీక్షలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని పథకాల్ని అమలు చేశానని రేవంత్ చెబుతుంటారని.. వాటిపై నమ్మకముంటే కొడంగల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు రావాలన్నారు. పట్నం నరేందర్ రెడ్డికి 50వేల మెజార్టీ వస్తుందని.. ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. ఇలాంటి సవాళ్లు కేటీఆర్ కు మామూలే.కాకుంటే.. తమ పదేళ్ల పాలనలో ఒక్కసారైనా ఇదే తరహా సవాళ్ల వరకు కాకున్నా.. కనీసం బహిరంగ చర్చకు రావాలన్న సవాల్ కు స్పందించి ఉన్నా బాగుండేది.
అదేమీ లేకుండా.. ఈ రోజున ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేందుకు చూపిస్తున్న ఉత్సాహం అత్యుత్సాహంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుభరోసా డబ్బులు టకాటకా పడతాయని సీఎం చెప్పారని.. మరి ఆ డబ్బులు వచ్చాయా? అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని జైలుకు వెళ్లి పరామర్శించినప్పుడు.. తాను ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంటానని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. నరేందర్ రెడ్డి రైతుల కోసం జైలుకు వెళ్లారని.. రేవంత్ రెడ్డిలా రూ.50 లక్షలతో దొరికిపోయి కాదన్నారు.
లగచర్లలో ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. తమ పార్టీ తరఫున మరో రూ.5 లక్షలు కలిపి రేవంత్ కు ఇస్తామన్న కేటీఆర్.. ‘‘కల్వకుర్తి సమీపాన వెల్దండలో సొంత భూముల్లో ఆయనఫార్మా కంపెనీని ఏర్పాటు చేయాలి’ అని పేర్కొన్నారు. ఇలాంటి మాటల దగ్గరే కేటీఆర్ర దొరికిపోతుంటారు. తమ ప్రభుత్వంలోనూ భూసేకరణ ఇష్యూ రచ్చ అయ్యింది. అప్పట్లో అలాంటి విమర్శలకు స్పందించి.. తన తండ్రికి ఉన్న విశాలమైన ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది కదా? అన్న ప్రశ్న తలెత్తేలా కేటీఆర్ మాటలు ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.