వినేటోడు ఉండాలే కానీ.. అన్నట్లుగా ఈ సుద్దల షాకులేంది కేటీఆర్?
ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడటంలో తన మార్క్ ను వేయాలని తపించే కేటీఆర్.. ఆ తొందరలో అదే పనిగా తప్పులు చేస్తుండటం ఈ మధ్యన ఎక్కువైంది.
వినేటోడు ఉండాలే కానీ చెప్పేటోడు చెలరేగిపోతారన్న మాటకు నిలువెత్తు రూపంగా నిలుస్తారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరు కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు. తన తండ్రి అంత కాకున్నా.. ఆ తరహాను గుర్తు చసేలా మాటకారితనం.. తన బావ హరీశ్ కు ఆయుధంగా ఉండే దూకుడుతనాన్ని అద్దెకు తెచ్చుకొని మరీ చెలరేగిపోయే కేటీఆర్ తో ఉన్న ఒకే ఒక్క సమస్య.. ఆయన మాట్లాడే మాటల్ని విన్నంతనే.. కౌంటర్లు కోకొల్లలుగా వచ్చేస్తుంటాయి. పెద్ద పెద్ద మాటలు.. కేటీఆర్ మాటల్లో చెప్పాలంటే.. పొడువు మాటలు మాట్లాడే విషయంలో ఆయన తోపుగా చెప్పాలి. కానీ.. ఆ మాటలు విన్న మరుక్షణంలో మనసు మాత్రం మరి.. దీని సంగతేంటి తారకరామా? అన్న ప్రశ్నల్ని వేసేలా ఉండటమే అతి పెద్ద సమస్య.
ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడటంలో తన మార్క్ ను వేయాలని తపించే కేటీఆర్.. ఆ తొందరలో అదే పనిగా తప్పులు చేస్తుండటం ఈ మధ్యన ఎక్కువైంది. పొలిటికల్ టిల్లు అంటూ ఏ ముహుర్తంలోతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిందో కానీ.. ఆయన అచ్చు అలానే వ్యవహరించటం కనిపిస్తుంది. సీఎం రేవంత్ మాటలకు చెక్ పెట్టేలా తన ప్రవర్తనను మార్చుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ.. కేటీఆర్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా సార్థక నామధేయమన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.
కేటీఆర్ నోరు తెరిస్తే చాలు.. పదేళ్ల తమ పాలనను అదో స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ప్రజలేమీ పిచ్చోళ్లు.. వెర్రిబాగోలోళ్లు కాదు కదా? కేసీఆర్ పాలన ముగిసి కేవలం పదకొండు నెలలు మాత్రమే కదా అయ్యింది. ఇంకా.. చెప్పాలంటే కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకున్న కోపం ఇంకాతగ్గలేదు. ఆయన చేతిలో పాలనా పగ్గాలు ఉన్న వేళ.. ఎవరెవరిని ఎంతలావెంటాడారో ఇంకా గుర్తుండే ఉంది.
ఉద్యమ వేళలో ప్రాణం పెట్టిన నేతల లిస్టు భారీగా ఉన్న వేళలో వారికి మొండి చేయి చూపించి.. తమ పార్టీ సిద్ధాంతాలకు ఏ మాత్రం సూట్ కాని తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పార్టీలోకి తీసుకోవటమే కాదు.. గంటల వ్యవధిలో మంత్రిని చేసిన తీరు.. అదే సమయంలో రాజయ్య లాంటి నేత నుంచి డిప్యూటీ సీఎం పదవిని బలవంతంగా పీకేయటం లాంటివెన్నో చూడటం.. వైసీపీ.. టీడీపీ.. పార్టీలను తెలంగాణలో అడ్రస్ లేకుండా చేయటమే కాదు.. కాంగ్రెస్ చిట్టిని దాదాపు చించేసే పరిస్థితి వరకు తీసుకొచ్చారు. ప్రశ్నించటం.. నిలదీయటమే ఊపిరిగా చేసుకొని విజయం సాధించిన తెలంగాణ ఉద్యమానికి చిరునామాలైన భావస్వేచ్ఛను అణిచివేసిన తన తండ్రి పాలన గురించి కేటీఆర్ నీతులు చెప్పటమే అతి పెద్ద జోక్.
కేటీఆర్ మాటలకు విశ్వసనీయత ఎందుకు ఉండదంటే ఆయన మాట్లాడే ప్రతి మాటకు ఏదో ఒక కౌంటర్ రిఫరెన్సు రూపంలో ఇట్టే మనసులోకి వచ్చేస్తుంది. అంతేకాదు.. సుద్దులు చెప్పటంలో స్వామీజీని మించిపోయేలా ఆయన వ్యవహరించే తీరు కూడా నప్పదు. రాజకీయాన్ని దానికి సరిపోయే బ్లెండ్ లో కలపాలే కానీ.. అన్ని నియమాల్ని తొక్కిపారేసి పదేళ్లు పాలించిన ఘన చరిత్రను తమతో పెట్టుకొని.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు విలువలు.. సిద్దాంతాలు లాంటి తొక్కలో మాటలు మాట్లాడితే ప్రయోజనం సున్నా అన్న చిన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారు?
తాము అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల జోలికి రాలేదన్న మాటలు మాట్లాడినంతనే సగటు తెలంగాణ వ్యక్తి ఫక్కున నవ్వేసే పరిస్థితిని కేటీఆర్ ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నారు? వ్యవస్థల్ని తాము నియంత్రించినంత దారుణంగా మరెవరికి చేతకాదని ఇప్పటికి తెలంగాణలోని సగటుజీవి అనుకుంటున్నప్పుడు విలువల గురించి కేటీఆర్ మాట్లాడే మాటలు అతుకుతాయా? అన్నది ప్రశ్న. అందుకే.. కేటీఆర్ నోటి నుంచి వచ్చే నీతి చంద్రిక మాటలు తరచూ నవ్వుల పాలవుతుంటాయి.అందుకే ఆయన విలువలు.. సిద్ధాంతాల గురించి మాట్లాడినంతనే.. వంకాయ.. బెండకాయ అన్నట్లుగా ఉంటాయే తప్పించి.. వినేందుకు మనసు ఒప్పుకోదన్న వాస్తవాన్ని ఆయన ఎప్పటికి గ్రహిస్తారు?