హిందీకి ప్రాధాన్యత ఎందుకు..? అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.

Update: 2024-09-12 12:30 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. సమయం చిక్కినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపై ఆయన ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. సమస్యలపై నిలదీస్తూనే ఉన్నారు. ఏదో ఒక ట్వీట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేటీఆర్ X వేదికగా విరుచుకుపడ్డారు.

ఇంగ్లిషుకు ప్రత్యామ్నాయంగా హిందీని విధించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ప్రజలు ఏం తినాలో, ఏ భాష మాట్లాడాలో నిర్ణయించుకోవడానికి వారికే అనుమతివ్వాలని అన్నారు. ఇలా బలవంతంగా రుద్దడాన్ని ‘భాషా చావినిజం’గా అభివర్ణించారు. ఇతర భారతీయ భాషలతో పోటీ పడకుండా దేశంలో హిందీకి ఆదరణ పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. హిందీ ఇప్పుడు ఉపాధి, సాంకేతికతతో ముడిపడి ఉందని, భారత ప్రభుత్వం కూడా అన్ని కొత్త యుగం సాంకేతికతలను హిందీతో అనుసంధానించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని షా చెప్పారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ తమకు హిందీ ఆమోదం ఏం అవసరమని నిలదీశారు.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ మొదలైన వాటి ప్రమోషన్‌ను ఎందుకు పెంచకూడదు? భారతదేశంలోని 22 అధికారిక భాషలలో హిందీ ఒకటి. హిందీని మాత్రమే ప్రమోట్ చేయడం ఎందుకు అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అయితే.. హిందీ భాషపై కేంద్రాన్ని కేటీఆర్ తప్పుపట్టడం ఇదే మొదటి సారి ఏం కాదు. గతంలోనూ ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు. 2022లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు అన్ని సాంకేతిక, సాంకేతికేతర విద్యాసంస్థల్లో హిందీ మీడియం మార్చేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ సైతం రాశారు.

తాజాగా.. అమిత్ షా మరోసారి హిందీ భాషను తెరపైకి తీసుకురావడంపై ట్వీట్ చేశారు. హిందీని పరోక్షంగా విధించడం వల్ల కోట్లాది మంది యువకుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనేది వివరించారు. కేంద్ర ఉద్యోగాల అర్హత పరీక్షల్లో హిందీ, ఇంగ్లిషులో ప్రశ్నలు రావడంతో ప్రాంతీయ భాషల్లో విద్యనభ్యసించే విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News