హతవిధీ.. ఏమిటీ పరిస్థితి.. కేటీఆర్ ప్లాన్స్ అన్నీ రివర్స్!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది.

Update: 2024-10-16 04:27 GMT

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు అధికార హోదాను అనుభవించారు. పది నెలల క్రితం రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి నుంచి ఇరుకున పెట్టే ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. అందులోభాగంగానే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుతగులుతూనే ఉన్నారు. ఫైనల్లీ ఆయన చేస్తున్న ఆరోపణలు.. ఆయన చేస్తున్న విమర్శలు తుస్‌మంటున్నాయి. ఫలితంగా ప్రజాక్షేత్రంలో పార్టీ మరింత అభాసుపాలుకాక తప్పడం లేదు.

ఎంతో ఆశతో ప్రభుత్వ ఈమేజీని డ్యామేజీ చేయాలని చూస్తున్న కేటీఆర్‌కు ఆయన వ్యా్ఖ్యలు ఆయనకే రివర్స్ అవుతున్నాయి. ఏ ఆశయంతో అయితే ముందుకు వెళ్దామని అనుకుంటున్నారో ఆయన లక్ష్యం నెరవేరడం లేదు. ముఖ్యంగా అమృత్ స్కీములో చాలా ఆరోపణలు చేశారు. అలాగే.. మూసీ సుందరీకరణలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక హైడ్రా అంశంలోనూ పలు విధాలా విమర్శలు చేశారు. వాటికి ప్రజల్లో పెద్దగా మైలేజీ రాలేదని సమాచారం.

ఎంతసేపూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ను ఎండగట్టాలని బీఆర్ఎస్ మొదటి నుంచీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగా కేటీఆర్ చేస్తున్న వ్యూహాలన్నీ బెడిసికొడుతున్నాయి. అమృత్ స్కీమ్ టెండర్లలో ఏకంగా రూ.8,888 కోట్ల అవినీతి జరిగిందంటూ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకే రూ.1,137 కోట్ల టెండర్లు కట్టబెట్టారంటూ రాద్ధాంతం చేశారు. ఈ ఆరోపణలపై సృజన్ రెడ్డి వెంటనే స్పందించి కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. కేటీఆర్ చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు.. మూసీ సుందరీకరణపైనా కేటీఆర్ పలు ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బుల్లేవు కానీ.. లక్షా 50 వేల కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తారంట అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. సంక్షేమ పథకాల కోసం నిధులు ఖర్చు చేస్తే కమీషన్లు రావనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ అంశాన్ని ఎంచుకుందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల వరకు మింగొచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను సూటుకేసులను రాహుల్ గాంధీకి దోచి పెట్టొచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులు ఘాటుగా రిప్లై ఇచ్చారు. మూసీ సుందరీకరణకు 2017లోనే బీఆర్ఎస్ రూపకల్పన చేసిందని ఆధారాలతో సహా వెల్లడించింది. ఇప్పుడు తాము కొత్తగా చేసిందేమీ లేదని, దానినే కొనసాగిస్తున్నామని వెల్లడించారు. దాంతో కేటీఆర్ ఈ విషయంలోనూ ఫెయిల్ అయ్యారని టాక్ వినిపించింది. కాంగ్రెస్ ఎదురుదాడితో బీఆర్ఎస్ ఎటూపాలుపోక డైలమాలో పడిందనేది సమాచారం.

ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా తన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి కేటీఆర్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ‘మాది నిర్మాణం.. మీది విధ్వంసం’ అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. హైడ్రా పేరుతో బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వం హైడ్రాకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీఆర్ఎస్‌కు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ విషయంలోనూ కేటీఆర్ ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది.

నిన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీకి సంబంధించిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అయితే..ఈ రాడార్ ఏర్పాటును సైతం కేటీఆర్ వ్యతిరేకించారు. రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయవద్దని.. అవసరం అయితే పర్యావరణ వేత్తలతో కలిసి పోరాటం చేస్తామని మాట్లాడుకొచ్చారు. జనావాసాలు లేని చోట నిర్మించాల్సిన రాడార్ వ్యవస్థను ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2017లోనే నేవీ రాడార్ స్టేషన్‌కు భూ బదలాయింపు జరిగిందని, అప్పుడు అంగీకరించి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. దీంతో రాడార్ విషయంలోనూ కేటీఆర్ ఫెయిల్ అయ్యారు. ఇలా పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంతో క్యాడర్ అంతా నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News