ఏమైనా జరగొచ్చు.. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, సోషల్ వారియర్స్‌ను ఉద్దేశించి ఆయన కీలక ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారని కేటీఆర్ అన్నారు. తమ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ నేతలు అసహనంతో ఉన్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు బయటకు తెస్తున్న సోషల్ వారియర్స్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు.
అలాగే.. రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను కూడా ప్రస్తావనకు తెచ్చారు. సుదీర్ఘమైన రాజకీయ కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయని.. ఇది తొలి అంకం మాత్రమేనని కేటీఆర్ వివరించారు. రానున్న రోజుల్లో మరింత బురదజల్లే రాజకీయాలు వస్తాయని చెప్పారు. కుట్రలు, వ్యక్తిగత దాడులు, అబద్ధపు ప్రచారాలను ఎదుర్కొనేందుకు మరింత సిద్ధంగా ఉండాలని సూచించారు.
'త్వరలోనే మనపై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తాం. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ మనల్ని టార్గెట్ చేస్తాయి. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు. వాటిని మీ దృష్టి మరల్చనివ్వవద్దు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. డీప్ ఫేక్ టెక్నాజీతో వీడియోలు వదులుతారని, పెయిడ్ ఆర్టిస్టులతో నాటకాలు వేయిస్తారని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై పోరాటంలో ఏ మాత్రం వెనక్కి తగ్గొద్దని కోరారు. రేవంత్ 420 వాగ్దానాల అమలులో వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలని పిలుపునిచ్చారు.