ప్రవక్తను దూషిస్తూ పోస్టులు.. నలుగురికి మరణశిక్ష.. ఎక్కడంటే?

ఇంతకు వారు చేసిన ఘోరమైన నేరం ఏమంటే.. మహమ్మద్ ప్రవక్తను.. ఆయన భార్యలను తప్పు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Update: 2025-01-26 04:34 GMT

మత విశ్వాసాలు దెబ్బ తీసేలా వ్యవహరించినా.. ఆ తరహాలో మాట్లాడినా.. చివరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అదో పెద్ద నేరంగా మారుతోంది పాకిస్థాన్ లో. తాజాగా అలాంటి పనులకు పాల్పడిన నలుగురికి మరణశిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. ఇంతకు వారు చేసిన ఘోరమైన నేరం ఏమంటే.. మహమ్మద్ ప్రవక్తను.. ఆయన భార్యలను తప్పు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇలాంటి చేష్టలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు.. వారిపై తీవ్ర నేరారోపణల్ని చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తాజాగా నలుగురికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. కొందరికి 80 ఏళ్లు జైలుశిక్ష.. రూ.52 లక్షల జరిమానాతో పాటు ఇతర తీవ్ర శిక్షల్ని విధించింది లాహోర్ కోర్టు.

నిందితులు మహమ్మద్ ప్రవక్తను.. ఆయన భార్యల్ని.. సహచరుల్ని నిందిస్తూ నాలుగు వేర్వేరు ఐడీలన నుంచి పోస్టులు పెట్టిన వైనం నిరూపితమైంది. పాకిస్థాన్ లో దైవాన్నీ.. మతాన్నీ దూషిస్తే తీవ్రమైన శిక్షలు విధించేలా కఠిన చట్టాలు ఉన్నాయి.

ఇంతలా మతానికి ప్రాధాన్యతను ఇచ్చే దేశంలో.. మతపరంగా మైనార్టీలను.. ఇస్లామేతర వర్గాలకు చెందిన వారిని మాత్రం తీవ్రంగా వేధింపులకు గురి చేయటం.. చట్టాన్ని దుర్వినియోగం చేయటం లాంటివి చేస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతంలోనే ఆరోపించిన సంగతి తెలిసిందే. మతం ఏదైనా.. అన్ని మతాల్ని సమానంగా చూసే ధోరణి లేకున్నా.. ఇతర మతాల్ని గౌరవించే తీరు పాకిస్థాన్ లో అస్సలు ఉండదన్న విమర్శలు బలంగా వినిపిస్తూ ఉంటాయి.

Tags:    

Similar News