దావోస్ కు వెళ్లటానికి ముందు ఈ మాటలే చెప్పొచ్చుగా చంద్రబాబు

ఇదే సమయంలో గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ. వారి కారణంగానే పెట్టుబడులు రాలేదన్న ఫిర్యాదులు చేస్తున్నారు.

Update: 2025-01-26 04:15 GMT

భారీ అంచనాలు ఒక్కసారి ఇబ్బందికర పరిస్థితులకు తెర తీస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పెట్టుబడుల కోసం దావోస్ కు వెళ్లిన చంద్రబాబు అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి. వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్న ఆయన.. చివరకు వచ్చేటప్పుడు మాత్రం ఉత్త చేతులతో వచ్చారు. తండ్రీ కొడుకులు ఇద్దరు నాన్ స్టాప్ గా భేటీలు జరిపిన తర్వాత తేలిందేమంటే.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా లేరన్న విషయం దావోస్ పర్యటనతో తేలిపోయింది. దీంతో అప్పటివరకు చంద్రబాబు మీద గంపెడుఆశలు పెట్టుకున్న వారు సైతం షాక్ తినే పరిస్థితి.

అంతటి అనుభవం ఉన్న చంద్రబాబు ఒక డాలరు పెట్టుబడి తేలేని పరిస్థితుల్లో ఉండటం చూస్తే.. ఏపీ బ్రాండ్ కు జరిగిన డ్యామేజ్ ఎంతన్నది అర్థమవుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్య రీతిలో భారీ పెట్టుబుడులను సొంతం చేసుకున్నారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పోలిక మొదలైంది. దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న విషయం తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తేనే అర్థమవుతుంది.

ఇలాంటి సందర్భాల్లోనే చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ. వారి కారణంగానే పెట్టుబడులు రాలేదన్న ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే వరకు.. ఇలాంటి మాటలు బాగుంటాయి. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తరహా మాటలు చెబితే అంత సూట్ కావు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్నిసరిదిద్దేందుకే చంద్రబాబు ఉన్నారన్నది మర్చిపోకూడదు.

దావోస్ కు వెళ్లటానికి ముందే.. ఏపీకి వచ్చే పెట్టుబడుల అవకాశాలు ఎన్ని ఉన్నాయన్న విషయం మీద చంద్రబాబు ఫోకస్ చేసి ఉంటే.. ఇప్పటి ఇబ్బందికర పరిస్థితిని ఆయన ఎదుర్కొనే వారు కాదు. దావోస్ కు వెళ్లి ఎన్ని పెట్టుడులు రాష్ట్రానికి తీసుకొచ్చారన్న దానికి.. దావోస్ కు వెళ్లటానికి ముందే తమ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల పెట్టబుడులు తెచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాలంలో ఇలాంటి మాటలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్న నిజాన్ని చంద్రబాబుకు ఎందుకు గ్రహించటం లేదు?

దావోస్ కు వెళ్లకకుండానే రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చినట్లుగా చెప్పుకుంటున్న చంద్రబాబు..ఒకవేళ దావోస్ కు భారీ అంచనాలు పెరిగేలా హడావుడి చేస్తూ వెళ్లకుండా ఉన్నా బాగుండేది. అంతా అయ్యాక.. దావోస్ కు వెళ్లటానికి ముందే తాము భారీగా పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చినట్లుగా చెప్పుకోవటం తన వైఫల్యాన్ని కవర్ చేసుకోవటంలా కనిపిస్తుందే తప్పించి.. ఇంకొకటి కాదు. పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ తరహా తప్పుల్ని ఎందుకు చేస్తారు? అన్నది ప్రశ్న.

దావోస్ కు వెళ్లి ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించలేని పరిస్థితిని చంద్రబాబు ఫెయిల్యూర్ గా చూడటం తప్పే అవుతుంది. అది ఏపీకి ఉన్న ఇమేజ్ గా మాత్రమే చూడాలి. ఇక్కడే దావోస్ కారణంగా ఏపీకి జరిగిన డ్యామేజ్ అర్థమవుతుంది. పెట్టుబడులు రాలేదన్న సంతోషాన్ని రాజకీయ ప్రత్యర్థులకు సంతోషాన్ని ఇవ్వొచ్చు. కానీ.. ఈ మొత్తం ఎపిసోడ్ తో అర్థమయ్యేదేమంటే.. ఏపీ ఇమేజ్ ను పెంచేందుకు చాలానే చేయాల్సి ఉంది. ఇప్పుడా అంశం మీద చంద్రబాబు ఫోకస్ చేసి ఏపీ బ్రాండ్ ను బిల్డ్ చేయాలి. అప్పుడే.. ఆయన కోరుకుంటున్నట్లు చైనాను.. ఇంకో దేశాన్ని అధిగమించే వీలుంటుంది. అంతకుమించి చేసే వ్యాఖ్యలు.. తీసుకునే నిర్ణయాలు నష్టాన్నే కలిగిస్తాయన్న నిజాన్ని ఒప్పుకోవాలి.

Tags:    

Similar News