చంద్రబాబు పై కేసీఆర్ కక్ష సాధింపా.. ఆ ఆలోచనే లేదన్న కేటీఆర్
టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం, జనసేనతో స్నేహం కోసం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా తనదైన దూకుడుతో సాగిపోతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ కు గానీ తనకు గానీ ఎలాంటి కోపం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. అంతే కాకుండా చంద్రబాబు ఆరోగ్యం గురించి లోకేష్ తో మాట్లాడానని కూడా కేటీఆర్ చెప్పారు. బాబుపై కక్ష సాధించే ఆలోచనే కేసీఆర్ కు లేదని కూడా తెలిపారు. గతంలో బాబు పిలిచిన వెంటనే అమరావతికి కేసీఆర్ వెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు.
మరోవైపు బాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తనకు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య లాంటి వాళ్లను కేటీఆర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ప్రచార రథం మీద నుంచి తాను పడ్డ తర్వాత లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారని కేటీఆర్ వెల్లడించారు.
ఎవరితోనూ తనకు వైరుధ్యం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం, జనసేనతో స్నేహం కోసం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ నేరుగా స్పందించలేదు. తన మంత్రులతో మాట్లాడించారు. ఇక బాబుకు మద్దతుగా హైదరాబాద్లో ర్యాలీలు చేస్తుంటే అనుమతి లేదని కేటీఆర్ అన్నారు. ఏమైనా ఉంటే ఏపీలో చేసుకోమన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి బాబుపై ప్రేమ ఒలకబోస్తున్నారు.
ఈ సారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదార్ల ఓట్ల కోసం కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ సారి బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనతోనూ వైరం ఎందుకని పనిలో పనిగా పవన్ ను అన్నయ్య అని కేటీఆర్ పేర్కొన్నారని చెబుతున్నారు.