బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై జోరుగా కథనాలు.. కేటీఆర్ ఘాటైన ట్వీట్
బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిందని ఫలితంగానే బీజేపీకి 8 స్థానాలు దక్కాయనేది ప్రధాన ఆరోపణ.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఖాతా కూడా తెరవలేకపోయిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రస్తుతం దేశంలో అత్యంత సంక్షోభం ఎదుర్కొంటున్న పార్టీ అని చెప్పదు. అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కూడా అయిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నాలుగు నెలలుగా తిహాడ్ జైలులో ఉన్నారు. దీంతోపాటు పదేళ్ల కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రభుత్వం తవ్వకాలు చేపడుతోంది. మేడిగడ్డ కుంగడం సహా విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరుపుతోంది. మరోవైపు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పై పెద్ద వదంతి మొదలైంది.
కలిపేస్తారంటూ ఊహాగానాలు
బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిందని ఫలితంగానే బీజేపీకి 8 స్థానాలు దక్కాయనేది ప్రధాన ఆరోపణ. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలవడమే దీనికి నిదర్శనమని అధికార కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజకీయంగా ఇవి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్ పలుచోట్ల డిపాజిట్లు కోల్పోవడంతో విమర్శలకు ఊతం ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ మద్యం స్కాంలో జైలుకెళ్లిన కవితను బయటకు తీసుకురావడానికి బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందనే ఆరోపణలూ ఉన్నాయి. పలు మీడియా సంస్థలు కూడా ఈ మేరకు కథనాలు ప్రచురించాయి. గతంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఇబ్బందులు పెట్టిన ఓ జర్నలిస్టుకు చెందిన మీడియాలోనూ ఇలాంటి విలీన కథనాలు వచ్చాయి.
బీజేపీతో సత్సంబంధాలుండడంతో
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కథనం ఇచ్చిన మీడియా అధినేతకు జాతీయ స్థాయిలో బీజేపీతో సంబంధాలుండడంతో సంచలనంగా మారింది. ఈ మీడియా అధినేత గతంతో స్థాపించిన నెట్ వర్క్ ను బీజేపీ జాతీయ నేతలే ఆవిష్కరించారు. అయితే, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసి బయటకు పంపించింది. విలీనం కొద్ది రోజుల్లోనే అంటూ పేర్కొనడం కూడా గమనార్హం. ఆయన అంత కచ్చితంగా చెబుతుండడంతో సంచలనంగా మారింది. కొద్ది రోజుల కిందట బీజేపీలో విలీనం అంశంపై బీఆర్ఎస్ ఒకప్పటి మిత్రపక్షం అయిన ఎంఐఎం ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
కేటీఆర్ మండిపాటు..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కథనాలను మరీ ముఖ్యంగా ఆ మీడియా సంస్థలో కథనం రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తమపై కథనాలు రాసినవారు వెంటనే ఖండన తెలియజేయాలని డిమాండ్ చేశారు. పడతాం.. లేస్తాం.. తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాం.. అని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.