ఒక్క స్పీచ్ లో ఇన్నేసి పేర్లా కేటీఆర్?
రాజకీయం అంటేనే నిందలు కామన్ అన్నట్లుగా కనిపిస్తాయి. దూకుడు రాజకీయాల్లో ఈ తీరు అంతకంతకూ పెరుగుతోంది.
రాజకీయం అంటేనే నిందలు కామన్ అన్నట్లుగా కనిపిస్తాయి. దూకుడు రాజకీయాల్లో ఈ తీరు అంతకంతకూ పెరుగుతోంది. గతంలో ఒక నేతను.. మరో నేత ఒక మాట అనాలంటే సవాలచ్చ ఆలోచించేవారు. ఎంతో అవసరం అయితే తప్పించి.. ఒక మాట అనేందుకు పెద్దగా ఇష్టపడే వారు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు దారుణంగా తిట్టిపోసిన వ్యక్తి సైతం.. కొన్ని గంటల వ్యవధిలోనే తాను తిట్టిన నేతను ఆకాశానికి ఎత్తేయటం కనిపిస్తుంటుంది. ఇందుకు గల్లీ నేతలు మొదలు అగ్రనేతల వరకు మినహాయింపు కాని పరిస్థితి.
మిగిలిన రోజుల్లో రాజకీయం ఎలా ఉన్నా.. కీలకమైన ఎన్నికల వేళ.. అందునా సానుకూలత తక్కువగా ఉందన్న మాట అదే పనిగా బలంగా వినిపిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యల జోరు మరింత పెరుగుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి.. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత కీలకంగా వ్యవహరించే కేటీఆర్ మాటల తీరు ఆసక్తికరంగామారింది. తెలంగాణ భవన్ లో తాజాగా మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.
ఇటీవల కాలంలో ఇంత దారుణంగా.. ఇన్నేసి పేర్లను ఒకే సందర్భంలో పెట్టింది లేదన్న మాట వినిపిస్తోంది. ఆలిండియా పప్పు రాహుల్ గాంధీ అయితే తలెంగాణ పప్పు రేవంత్ రెడ్డి అని చెప్పారు. దావూద్ ఇబ్రహీం.. చార్లెస్ శోభరాజ్ కంటే కూడా రేవంత్ డేంజర్ అని వ్యాఖ్యానించారు. ఇంతకూ కేటీఆర్ కు ఇంత ఆగ్రహం ఎందుకు? అంటే.. తాజాగా వారు కాళేశ్వరం వెళ్లిన రాహుల్.. రేవంత్ లు తెలంగాణ ప్రభుత్వం పని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
దీనికి కౌంటర్ అన్నట్లుగా కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. బ్రిడ్జి ఎక్స్పాన్షన్ లెవల్ ను చూపిస్తూ.. కూలిపోతుందని ఫోటోలు పెడుతున్నారంటూ.. వారి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వీళ్లు మహా ఇంజనీర్లు.. ఇదీ.. వీళ్ల అవగాహన’ అంటే ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ను ఆలిండియా పప్పుగా.. రేవంత్ ను తెలంగాణ పప్పుగా అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు వరమైతే.. దేశానికి శనీశ్వరం కాంగ్రెస్ పార్టీ అని చమత్కరించారు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలియదని.. తెలుసుకునే సోయి లేదన్నారు. తెలంగాణ జాతి సంపద కాళేశ్వరంపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదన్న కేటీఆర్.. ‘నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులో మీ అమ్మ.. నువ్వు ఇద్దరు అవినీతి చేసింది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. ఏఐసీసీ అంటే ఆలిండియాచెత్తా చెదారంగా అభివర్ణించిన కేటీఆర్.. టీపీసీసీ అంటే తలెంగాణ పెరట్లో చెత్తాచెదారంగా మండిపడ్డారు. కేటీఆర్ ఆగ్రహానని చూస్తే.. ఆయన మాటల్లో ఫస్ట్రేషన్ అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఎంత ఫస్ట్రేషన్ ఉంటే మాత్రం.. ఒకే స్పీచ్ లో రాజకీయ ప్రత్యర్థులకు ఇన్నేసి పేర్లు పెట్టుడా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.