కేటీఆర్ సెంట్రిక్‌గా ట్వీట్ల యుద్ధం.. ఏం జ‌రిగిందంటే!

అయితే, షా విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొడుతూ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. దీనికి ప్ర‌తిగా బీజేపీ అగ్ర‌నేత‌, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ రియాక్ట్ అయ్యారు.

Update: 2023-10-12 03:46 GMT

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ అగ్ర‌నేత‌లు ట్వీట్ల యుద్ధానికి తెర‌దీశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య స‌హ‌జంగానే జ‌రిగే పొలిటిక‌ల్ వార్‌కు ఈ ట్వీట్ల యుద్ధం మ‌రింత‌గా ఆజ్యం పోసిన‌ట్టు అయింది. మంగ‌ళ‌వారం కేంద్ర హొం మంత్రి అమిత్ షా తెలంగాణ‌లో ప‌ర్య‌టించి..కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. అయితే, షా విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొడుతూ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. దీనికి ప్ర‌తిగా బీజేపీ అగ్ర‌నేత‌, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ రియాక్ట్ అయ్యారు.

అదే ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి కేటీఆర్‌పై ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కాలేదని ఫ్రస్ట్రేషన్‌లో కేటీఆర్ ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే స్థాయికి మించిన మాట‌లు మాట్లాడుతున్నార‌ని, మోడీ, అమిత్ షాల‌ను తిట్టినంత మాత్రాన వారికి స్థాయికి కేటీఆర్ ఎద‌గ‌లేర‌ని దుయ్య‌బ‌ట్టారు. "మోడీ, అమిత్ షా ఎక్కడ.. నువ్వెక్కడ" అంటూ కేటీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో అధికార పార్టీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం ఖాయ‌మ‌ని, తండ్రి కొడుకులు ఇద్ద‌రూ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవ‌డ‌మేన‌ని ల‌క్ష్మ‌ణ్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, ఇదే రేంజ్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం కేటీఆర్ కేంద్రంగా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. "దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్" అని ప్రారంభించి రాష్ట్రంలో నిరుద్యోగం స‌హా తెలంగాణ అమ‌ర వీరుల‌కుటుంబాల క‌ష్టాల‌ను కూడా రేవంత్‌రెడ్డి ఏక‌రువు పెట్టారు. ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా? అని కేటీఆర్‌ను రేవంత్ ప్ర‌శ్నిచంఆరు.

సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా? అని విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను రేవంత్ ఎత్తి చూపారు. కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? అని తెలంగాణ అమ‌ర వీరుల కుటుంబాల క‌ష్టాల‌ను ప్ర‌స్తావించారు. తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి... ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుందని తీవ్ర‌స్తాయిలో రేవంత్ వ్యాఖ్యానించారు. మొత్తంగా అటు బీజేపీ, ఇటుకాంగ్రెస్ పార్టీల నుంచి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా భారీ సెగ త‌గ‌ల‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News