బొత్స, వైవీకి షాక్.. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా కన్నబాబు
అయితే ఈ పదవిపై పార్టీలో చాలా మంది సీనియర్లు ఆశ పెట్టుకున్నప్పటికీ అధినేత మాత్రం కురసాల కన్నబాబుకి అవకాశం ఇచ్చారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. ఇంతవరకు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహరించేవారు. గత నెల ఆయన రాజీనామా చేయడంతో ఉత్తరాంధ్రకు కొత్త సమన్వయకర్తను నియమించాల్సివచ్చింది. అయితే ఈ పదవిపై పార్టీలో చాలా మంది సీనియర్లు ఆశ పెట్టుకున్నప్పటికీ అధినేత మాత్రం కురసాల కన్నబాబుకి అవకాశం ఇచ్చారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డి లేదా వైవీ సుబ్బారెడ్డి మాత్రమే వ్యవహరించేవారు. ఒకానొక సమయంలో అదే ప్రాంతానికి చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కూడా ఇన్ చార్జి చేశారు. అయితే విజయసాయిరెడ్డి నిష్క్రమణ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా వైవీ, లేదా బొత్సను నియమిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స.. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువైన వైజాగ్ లో స్థావరం ఏర్పాటు చేసుకుని మూడు ఉమ్మడి జిల్లా రాజకీయాలను బొత్స సమన్వయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనను కాదని పార్టీ మాజీ మంత్రి కురసాల కన్నబాబుకి అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.
ప్రస్తుతం కాకినాడ జిల్లా వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న కురసాల కన్నబాబుకు ప్రమోషన్ వచ్చిందని అంటున్నారు. ఆయన స్థానంలో మరో మాజీ మంత్రి, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. జర్నలిస్టుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన కన్నబాబు తొలుత ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయన 2019లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలి మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన సమర్థతపై నమ్మకం, పార్టీ పట్ల కమిట్మెంట్ ఇప్పుడు ఆయనను రీజనల్ ఇన్ చార్జి స్థాయికి చేర్చిందని అంటున్నారు. వాస్తవానికి ఈ పోస్టుకు ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని పేరు పరిశీలించారు. అయితే ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ కోసం సమయం కేటాయించలేనని చెప్పడంతో ప్రత్యామ్నాయంగా కన్నబాబు పేరు తెరపైకి వచ్చినట్లు వైసీపీ వర్గాల సమాచారం. మొత్తానికి ఇద్దరు సీనియర్ నేతలను కాదని కన్నబాబుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది.