కుర్చీ తాత అరెస్ట్... అసలు విషయం ఇదే!

దీంతో అసలు విషయం ఏమిటనే చర్చ నెట్టింట బలంగా సాగుతుంది.

Update: 2024-01-24 16:19 GMT

"ఆ కుర్చీని మడతపెట్టి..." అని ఒక "బీప్" డైలాగుతో ఫేమస్ అయిన కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అనే వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలో... కుర్చీ తాతను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వరకు తీసుకెళ్లిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు విషయం ఏమిటనే చర్చ నెట్టింట బలంగా సాగుతుంది.

అవును... "ఆ కుర్చీని మడతపెట్టి..." అనే డైలాగ్ తో నెట్టింట వైరల్ గా మారిన కాలా పాషాని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. గతంలో ఉప్పల్ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ అరెస్ట్ జరిగిందంటూ ప్రచారం జరుగుతుంది. అందుకు కారణం... కుర్చీ తాత తనపై చేసిన ఆరోపణలే అని వైజాగ్ సత్య చెప్పినట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... కుర్చీ తాతను తమన్ వరకు తీసుకువెళ్తే... ఇప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని తానే కాజేసినట్టు ప్రచారం చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడని అంటున్నారు. అయితే... తనతో మొదట్లో తాత బాగానే ఉండేవాడని.. గుంటూరు కారం సాంగ్ లో తన డైలాగ్ వాడటంతో మహేష్ బాబు నుంచి ఇల్లు ఇప్పించమని అడిగాడని.. అయితే అది తన వల్ల కాదని చెప్పినప్పటినుంచీ ఎదురు తిరిగి ఇలా తనను బద్నాం చేస్తున్నాడని వైజాగ్ సత్య వాపోతున్నాడని చర్చ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది!

కాగా... ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు సినిమా "గుంటూరు కారం"లో సదరు వ్యక్తి నోటి వెంట వచ్చిన "కుర్చీ మడత పెట్టి..." అనే మాటతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ సిద్ధం చేసి వదిలిన సంగతి తెలిసిందే. అయితే... మహేష్ బాబు సినిమాలో ఇలాంటి డైలాగ్ తో కూడిన పాట ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే!

Full View

Tags:    

Similar News