21తో 11....లెక్క కరెక్ట్ గా సరిపోయింది !

21 ఏంటి 11 ఏంటి అన్న డౌట్ రావచ్చు. కానీ ఎక్కడైనా నంబర్ తోనే గేమ్. అది కరెక్ట్ గా కుదిరితే రిజల్ట్ పక్కగా వస్తుంది. నంబర్ గేమ్ లో మ్యాజిక్ ఇదే

Update: 2025-01-17 20:01 GMT

21 ఏంటి 11 ఏంటి అన్న డౌట్ రావచ్చు. కానీ ఎక్కడైనా నంబర్ తోనే గేమ్. అది కరెక్ట్ గా కుదిరితే రిజల్ట్ పక్కగా వస్తుంది. నంబర్ గేమ్ లో మ్యాజిక్ ఇదే. అందుకే ఇపుడు అంతా 21తో 11 అంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే ఏపీ నుంచి కూటమి తరఫున 21 మంది ఎంపీలు గెలిచారు. వారి మద్దతుతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11 వేల 400 కోట్ల రూపాయల భారీ ఆర్ధిక ప్యాకేజీ లభించింది. ఒక విధంగా అసాధ్యం సుసాధ్యం చేసింది 21 నంబరే. అంతే కాదు ఎపుడూ పొలిటికల్ మేథమెటిక్స్ నే దేనినైనా శాసిస్తుంది అనడానికి ఇదే మంచి ఉదాహరణ అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ ఆర్ధికంగా బలోపేతం కావడానికి కేంద్ర ప్రభుత్వం 11 వేల 400 కోట్ల రూపాయలను ప్రకటించడం నిజంగా అద్భుతం అని అంటున్నారు. ఈ మేరకు గురువారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్ధిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది.

దాంతో ప్రైవేట్ ఉరి కంబం మీద వేలాడుతుంది అనుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ శాశ్వతమైన ఊపిరిని పోసుకుని అద్వితీయ బలంతో ముందుకు దూసుకుపోయేందుకు మార్గం సుగమం అయింది. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇంతటి భారీ ప్యాకేజిని సాధించడం ద్వారా ఏపీ ప్రభుత్వం అతి పెద్ద విజయమే సాధించింది అని అంతా అంటున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా జూన్ 12న ప్రమాణం చేసినప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఆయన ఎపుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినా స్టీల్ ప్లాంట్ విషయం మీదనే ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామి తో బాబు ఇదే విషయం మీద చాలా ఒత్తిడి పెట్టారు.

మొత్తానికి కేంద్ర పెద్దల వద్ద బాబు పెట్టిన ఒత్తిడి పనిచేసింది. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే నష్టాల అంపశయ్య మీద ఉంది. ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నుల ఉక్కును కలిగి ఉన్నప్పటికీ ఎంతో విలువైన కర్మాగారంగా ఉన్నప్పటికీ అధిక నష్టాలే నమోదు అవుతూ వస్తున్నాయి. ఇక స్టీల్ ప్లాంట్ నష్టాలను ఒక్కసారి చూస్తే కనుక 2023-24లో రూ. 4,848.86 కోట్లు మరియు 2022-23లో రూ. 2,858.74 కోట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఉక్కు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు. ఆనాడు కేంద్ర మంత్రి ముందుకు వచ్చిన ప్రతిపాదనలు చూస్తే స్టీల్ ప్లాంట్ కష్టాలు ఆర్ధిక నష్టాల నుంచి బయటపడేందుకు రూ.18,000 కోట్ల ఆర్థిక సహాయం అవసరమని నిర్ధారించారు.

ఆ వెంటనే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ జిఎస్‌టి బకాయిల కోసం రూ. 500 కోట్లు ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద రెండు విడతలుగా ముడిసరుకు సేకరణ కోసం రూ. 1,150 కోట్ల అత్యవసర సహాయాన్ని అందించింది. అయితే ఉక్కు కర్మాగారం లేచి నిలబడేందుకు అవసరమైన భారీ ప్యాకేజీ విషయం మాత్రం అలాగే ఉండిపోయింది.

చివరికి అనేక చర్చలు జరిగిన తరువాత కేంద్రం రూ. 11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేందుకు అవకాశాలు రెట్టింపు అయ్యాయి. ఈ విజయం పూర్తిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే అని అంతా అంటున్నారు.

అంతే కాదు ఏపీ ప్రజలు విజ్ఞతతో కూటమికి ఇచ్చిన 21 ఎంపీ సీట్ల బలం పవర్ ఏంతో ఈ విధంగా తెలిసినట్లు అయింది. ఈ ఎంపీలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతివ్వడం ద్వారా ఏపీ ఇప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటోంది అని అంతా అంటున్నారు

Tags:    

Similar News