కేవీపీ ఉండవల్లి సీన్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే ?

ఆత్మగా అనా భావించే కేవీపీకి తెలియని వైఎస్సార్ జీవితం ఉండదని అంటారు. ఈ ఇద్దరు మిత్రులూ అన్ని విషయాలూ పంచుకునే వారు అని చెబుతారు.

Update: 2024-10-29 06:30 GMT

వైఎస్సార్ ది జగమంత కుటుంబం. ఆయన చిరునవ్వుతో ప్రత్యర్ధులను సైతం మిత్రులుగా చేసుకున్న వైనం ఆయన సొంతం. వైఎస్సార్ విజయ రహస్యం కూడా ఆ చిరునవ్వే. ఇక వైఎస్సార్ లో మరో గొప్ప సుగుణం ఉంది. ఆయనతో ఒకసారి స్నేహం చేసిన వారు కానీ సన్నిహితంగా ఉన్న వారు కానీ జీవితంలో ఆయన నుంచి వేరు కాలేదు

విధి వికృతంగా తలచి వైఎస్సార్ ని దూరం చేసింది తప్పించి ఆయనకు బంధువులు ఎందరు ఉన్నారో ఆత్మ బంధువులు కూడా అంతకు మించి ఉన్నారు. వైఎస్సార్ కి ఆత్మగా పేరు గడించిన వారు కేవీపీ రామచంద్రరావు. ఇద్దరిదీ వైద్య విద్యను అభ్యసించిన కాలం నాటి నుంచి గొప్ప స్నేహం.

అంటే వైఎస్సార్ పెళ్ళి కాక ముందు నుంచి కూడా కేవీపీతో బంధం ఉంది. అలా చూస్తే కనుక ఆయన విజయమ్మతో సమానంగా కూడా వైఎస్సార్ ని బాగా ఎరిగిన వారుగా చెబుతారు. వైఎస్సార్ ఏమిటి అన్నది కేవీపీకి బాగా తెలుసు.

ఆత్మగా అనా భావించే కేవీపీకి తెలియని వైఎస్సార్ జీవితం ఉండదని అంటారు. ఈ ఇద్దరు మిత్రులూ అన్ని విషయాలూ పంచుకునే వారు అని చెబుతారు. అలాగే మరో వ్యక్తి ఉండవల్లి అరుణ కుమార్. 1984లో కలసిన వైఎస్సార్ ఉండవల్లి బంధం చివరిదాకా కొనసాగింది. ఉండవల్లి స్వతహాగా న్యాయవాది. ఆయన మేధావితనానికి వైఎస్సార్ పదునైన వ్యూహాలు జత కలిస్తే బిగ్ షాట్స్ మీదనే కేసులు పడి ఉక్కిరి బిక్కిరి అయిన సందర్భం కూడా ఏపీలో అంతా చూసారు.

ఈ ఇద్దరూ వైఎస్సార్ ని మొత్తం ఆకళింపు చేసుకున్న వారుగా కనిపిస్తారు. ప్రస్తుతం చూస్తే వైఎస్సార్ కుటుంబంలో ఆరని చిచ్చుగా అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదం నడుస్తోంది. అది బట్టబయలు అయింది. రోడ్డు మీదకు వచ్చేసింది. దాంతో వైఎస్సార్ కుటుంబం రెండుగా చీలిపోయిన బాధ అభిమానులది అయింది.

ఆస్తి వివాదాలు ఏ కుటుంబంలో రావడం సహజం. అయితే దానిని జాగ్రత్తగా విప్పుకునే నైపుణ్యం కూడా ఉండాలని అంటున్నారు. ఆ విధంగా చూస్తే వైఎస్సార్ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం పెనవేసుకున్న ఉండవల్లి కేవీపీ ఈ క్లిష్ట సమయంలో రంగ ప్రవేశం చేసి అటు జగన్ ని ఇటు షర్మిలను కూడా కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తే సమస్యలు మొత్తం సమసిపోతాయని అంటున్నారు.

రాజకీయ పంధా ఎవరికి వారుగా అనుసరించవద్దు. వ్యక్తిగత ద్వేషాలు మంచివి కావని అభిమానులు అంటున్నారు. వైఎస్ విజయమ్మ ఈ సమయంలో ఎటూ చెప్పలేరని కూడా అంటున్నారు. ఆమె ఇప్పటికే కుమార్తె పక్షం ఉన్నారన్న నిందను మోస్తున్నారు.

దాంతో ఆమె ఏ రకమైన ప్రతిపాదన చేసినా మరొకరికి నచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. అందువల్ల వైఎస్సార్ ఆత్మగా కేవీపీ, దొడ్డ నేస్తంగా ఉండవల్లి రంగ ప్రవేశం చేయాల్సిందే అని అభిమానులు కోరుకోవడం విశేషం.

వైఎస్సార్ వంటి నాయకులు అరుదు అని, ఆయన ప్రజా నాయకుడని దివగంతులు అయినా ఆయన కీర్తి అజరామరం గా ఉందని ఆ మహా నేతకు కలంకం కలిగించే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత తొందరలో వీటికి తెర వేయాలంటే ఈ ఇద్దరు ఉద్ధండులూ సీన్ కోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే అని అంటున్నారు.

మరి అలా జరుగుతుందా వారి మనసులో ఏముంది. అన్నా చెల్లెళ్ళ వివాదాల్లోకి దూరాలన్న ఆసక్తి వారికి ఉందా లేదా అన్నది మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా వైఎస్సార్ అభిమానులు మాత్రం వీరి వైపే చూడడం విశేషం.

Tags:    

Similar News