యువ ఐపీఎస్ లీలలెన్నో.. విల్లా రాణి.. పేకాట రాజు!

రాష్ట్ర భద్రతను కాపాడే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ కూడా ఓ పిల్లర్.

Update: 2024-09-21 15:30 GMT

రాష్ట్ర భద్రతను కాపాడే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ కూడా ఓ పిల్లర్. అంతటి ప్రాధాన్యం గల శాఖలో పనిచేస్తున్న పలువురు పోలీసులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అది జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్ నగరం వరకూ పనిచేస్తున్న పోలీసులపై ఆ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులోనూ యువ ఐపీఎస్‌లే ఈ దారుణానికి ఒడిగట్టడం మరింత చర్చకు దారితీసింది. ఇంకొదరైతే ప్రొబేషనరీ సమయంలోనే వసూళ్లకు తెరతీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారు డ్యూటీలోకి వచ్చీరాగానే ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారణ కూడా చేశారు. మరో ఇద్దరు కీలక ఆఫీసర్లు అమెరికాలో ఉండిపోయారు. అయితే.. ఈ కేసు ఇలా కొనసాగుతుండగానే.. మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసు అయితే ఏం చేసినా చెల్లుతుందని కొందరి అభిప్రాయం. అందుకు పొలిటికల్ పరంగానూ సహకారం లభిస్తే అది మరింత ప్లస్ అవుతుంది. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల వేళ కొంత మంది పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే అపవాదు ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు కీలక విభాగానికి బదిలీపై వచ్చిన ఓ ఐపీఎస్ అధికారి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఆమె ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ విల్లాల ధరలు కనుక్కొని ఆరా తీస్తుండడం చేస్తుంటారు. హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ ఆమెపై పలు ఆరోపణలు రావడంతో మరో చోటుకు బదిలీ చేశారు. అయితే.. అక్కడ కూడా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో చర్చకు దారితీసింది.

అలాగే.. మల్టీజోన్ 2 పరిధిలో ఓ జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్ సైతం ఇదే తరహా అవినీతికి తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నింటినీ ఖర్చు చేసినట్లుగా చూపి అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి కిందిస్థాయి సిబ్బంది తీసుకెళ్లడంతో చివరకు అక్కడి నుంచి బదిలీ చేశారు. వీరితోపాటే ఇంకా చాలా మందిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వం వేటు వేసింది. చాలా వరకు ప్రాధాన్యం లేని పోస్టులకు వారిని బదిలీ చేసింది. యువ ఐపీఎస్‌లుగా ఉండి అవినీతికి పాల్పడడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది.

హైదరాబాద్ శివారులోని డీసీపీగా నియామకం అయిన ఓ మహిళా డీసీపీ.. అక్కడ కొంతకాలమే పనిచేశారు. కానీ.. ఆమె పనిచేసిన కాలంలో భూవివాదాల్లో తలదూర్చి వసూళ్లకు పాల్పడ్డారనే అపవాదు ఆమెపై ఉంది. ఓ నాలుగెకరాల భూమిని మరొకరికి కట్టబెట్టే ప్రయత్నంలో ఆమె అభాసుపాలయ్యారు. అలాగే.. రాష్ట్రంలో జూదం ఆటపై నిషేధం కొనసాగుతుంటే ఎస్పీ అయి ఉండి దానికి మద్దతు తెలిపారు. అంతేకాదు.. జూదరులను ఒక దగ్గరకు చేర్చి ప్రతీ ఆటకు రేటు కట్టి వసూళ్లకు పాల్పడినట్లు టాక్ ఉంది. నిఘా ఈ విభాగానికి విషయం తెలియడంతో ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందలించారు. ఆ తరువాత ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేశారు. ఇలా.. రాష్ట్రంలో ఒక్కో ఐపీఎస్ ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిష్పక్షపాతంగా ప్రజలు సేవలు అందించాల్సింది పోయి.. పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం నడుస్తోంది.

Tags:    

Similar News