ఓటింగ్ పోటెత్తలేదు.. దేనికి సంకేతం?
వైపుల నుంచి ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నాలు జరిగినా.. ఇలా ఎందుకు తగ్గిందనేది ప్రధాన ప్రశ్న.
ఓటింగ్ పోటెత్తలేదు. ప్రధాని మోడీ నుంచి రాష్ట్రపతి ముర్ము వరకు.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ దాకా.. అనేక మంది ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని.. ఓటింగ్ పోటెత్తేలా తరలి రావాలని పిలుపునిచ్చారు. కానీ, ఈ పిలుపులు ఫలించ లేదు. 2019 కన్నా దారుణంగా ఈ దఫా తొలి దశలో ఓటింగ్ శాతం నమోదైంది. గత 2019 తొలి దశలో 70 శాతం పోలింగ్ నమోదైతే.. ఇప్పుడు జరిగిన తొలిదశలో 60 శాతమే ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రజాస్వామ్య వాదులు.. ఎన్నికల సంఘం అధికారులు కూడా నివ్వెర పోయారు. ఊరూవాడా.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా ఫలితం దక్కకపోవడంపై తల పట్టుకున్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ ప్రక్రియ శుక్రవారం జరిగింది. 21 రాష్ట్రాలు, అండమాన్, లక్ష ద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక, తమిళనాడులోని మొత్తం 39 పార్లమెంటు స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. అయితే.. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు.. పోలింగ్ జరుగుతుంది. అయితే.. దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు మినహా.. అన్నిచోట్లా పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పెంచారు. అంటే..ఉదయం 7 నుంచి రాత్రి 7వరకు నిర్వహించారు.
అయినప్పటికీ.. పోలింగ్ శాతం పెరగకపోగా.. గత ఎన్నికలతో పోలిస్తే.. ఘోరంగా 10 శాతం తగ్గుముఖం పట్టింది. ఇక, నాగా లాండ్ వంటి ఈశాన్య రాష్ట్రంలో అయితే.. 0శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటేయలేదు. కేవలం పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి కుటుంబాల వారే ఓటేశారు. వారి పార్టీల నేతలు మాత్రమే వేశారు. కట్ చేస్తే.. త్రిపురలో మాత్రం ఒక్కస్థానానికి పోలింగ్ జరగ్గా ఇక్కడ మాత్రమే 80 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, తొలి దశ పోలింగ్ సందర్భంగా ఈశాన్య రాష్ట్రం, రిజర్వేషన్ ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ లో కాల్పులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.
ఇలా ఎందుకు జరిగింది?
అన్ని వైపుల నుంచి ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నాలు జరిగినా.. ఇలా ఎందుకు తగ్గిందనేది ప్రధాన ప్రశ్న. చిత్రం ఏంటంటే.. ఆయా రాష్ట్రాల్లో ప్రధాని మోడీ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా.. జోడో యాత్రలు నిర్వహించారు. ప్రియాంక గాంధీ నుంచి ఖర్గే వరకు అనేక మంది నాయకులు రోజుల తరబడి ప్రచారం చేశారు. అయినా.. ప్రజలు ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం.. పార్టీలపై నమ్మకం సన్నగిల్లడమే అయి ఉండాలని అంటున్నారు పరిశీలకులు. ఎవరు అదికారంలోకి వచ్చినా.. తమ జీవితాల్లో మార్పులు కనిపించడం లేదన్న భావన గూడుకట్టుకుని ఉండాలి. వీటికితోడు.. మండుతున్న ఎండలు కూడా కారణమే అయి ఉంటాయని అంటున్నారు పరిశీలకులు.