అప్పట్లో సెక్స్‌ లో పాల్గొనడానికి కనీస వయసు పదేళ్లే!

సమ్మతి వయసు అంటే... వివాహం లేదా లైంగిక చర్యలో పాల్గొనడానికి ప్రభుత్వం చట్టబద్ధంగా అనుమతించే వయసు

Update: 2023-09-30 04:09 GMT

మన దేశంలో శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రభుత్వం సమ్మతించిన వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే ప్రతిపాదనను లా కమిషన్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదని తాజాగా కేంద్రానికి లా కమిషన్‌ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఉండాల్సిన కనీస వయసుకు సంబంధించి లా కమిషన్‌ పలు విషయాలను పేర్కొంది.

సమ్మతి వయసు అంటే... వివాహం లేదా లైంగిక చర్యలో పాల్గొనడానికి ప్రభుత్వం చట్టబద్ధంగా అనుమతించే వయసు. ప్రస్తుతం పోక్సో చట్టం ఆధారంగా ప్రస్తుతం మన దేశంలో శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతిస్తున్న వయసు కనీసం 18 ఏళ్లుగా ఉంది. 2012లో పోక్సో చట్టం రాకముందు.. అమ్మాయిలకు శృంగారంలో పాల్గొనడానికి సమ్మతి వయసు 16 ఏళ్లుగా ఉండేది. పురుషులకు మాత్రం ఏ నిబంధన ఉండేది కాదు.

లా కమిషన్‌ నివేదిక ప్రకారం.. మనదేశంలో శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడానికి 1860లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమతించిన వయసు కేవలం పదేళ్లే కావడం గమనార్హం. అంటే పదేళ్ల వయసు ఉన్నవారు ఎవరైనా శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతి ఉండేది. ఆ తర్వాత ఈ వయసు పెరుగుతూ వచ్చింది.

అయితే 1860వ దశకంలోనే ఓ 11 ఏళ్ల బాలిక మరణంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. ఆమె భర్త బలవంతంగా లైంగిక చర్య చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై.. మృత్యువాత పడింది. దీంతో బలవంతపు శృంగారంతో భార్య ప్రాణాలు తీశాడని అతడికి ఏడాది శిక్ష పడింది.

ఈ నేపథ్యంలో 1891లో సెక్షన్‌ 375 కింద శృంగారంలో పాల్గొనడానికి కనీస వయసును 12 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం 1925లో ఈ సమ్మతి వయసును 14 ఏళ్లకు.. ఆ తర్వాత 1940లో మరోసారి 16 ఏళ్లకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా 1940 నుంచి 2012లో పోక్సో చట్టం అమల్లోకి వచ్చే వరకు మహిళలకు సమ్మతి వయసు 16 ఏళ్లుగానే ఉంది. 2012లో పోక్సో చట్టం అమల్లోకి వచ్చాక ఈ వయసు 18 ఏళ్లుగా మారింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే శృంగారంలో పాల్గొనడానికి ప్రభుత్వాలు సమ్మతించే వయసు 13 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంది. కెనడాలో శృంగారంలో పాల్గొనాలంటే కనీస వయసు 14 ఏళ్లు ఉండేది. దీన్ని 2008లో 16 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక అమెరికాలో ఫెడరల్‌ చట్టం ప్రకారం.. శృంగారంలో పాల్గొనడానికి కనీసం 18 ఏళ్లు ఉండాల్సిందే. అయితే అమెరికాలో ఉన్న వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉండటం గమనార్హం.

ఆస్ట్రేలియాలో శృంగారంలో పాల్గొనాలంటే ప్రభుత్వం అనుమతించిన వయసు 16 నుంచి 17 ఏళ్లుగా ఉంది. జపాన్‌ లో ఇటీవల వరకు 13 ఏళ్లుగా ఉండగా ఈ సంవత్సరం దాన్ని 16 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే దక్షిణాఫ్రికాలోనూ శృంగార సమ్మతి వయసు 16 ఏళ్లుగా ఉంది.

Tags:    

Similar News