చంద్రబాబు లాయర్ లూథ్రాపై రాజమండ్రిలో కేసు!?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే

Update: 2023-09-15 13:33 GMT

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బాబు అరెస్టైన వెంటనే హస్తిన నుంచి విజయవాడకు వచ్చారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. అయితే రిమాండ్ కు తరలించే వాదనల విషయంలో ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలతో కోర్టు ఏకీభవించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో లూథ్రాపై ఒక కేసు నమోదైంది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు తరుపున వాదనలు వినిపించడానికి వచ్చిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాపై కేసు నమోదైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు నేతృత్వంలోని వైసీపీ నాయకులు సిద్ధార్థ్‌ లూథ్రా పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

అయితే తాజాగా సిద్ధార్థ్ లూథ్రా చేసిన ట్వీటే ఇందుకు కారణం అని తెలుస్తుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్‌ రాకపోవడంతో సుప్రీంకోర్టు న్యాయవాది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలను ఆయుధాలు పట్టేలా ప్రోత్సహిస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

"అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తిపట్టడమే. పోరాటానికి ఇదే సరైన విధానం" అంటూ గురుగోవింద్‌ సింగ్‌ సూక్తులు ప్రస్తావిస్తూ లాయర్ లూథ్రా ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ ట్వీట్ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ఆయుధాలు చేపట్టమని ప్రోత్సహించేలా ఉన్నాయని ఫిర్యాదులులో పేర్కొన్నారన్ని తెలుస్తుంది.

అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నిజంగా కత్తి తీయాలనేది లూథ్రా ఉద్దేశ్యం కాకపోవచ్చు.. కానీ, ఆ ట్వీట్ మాత్రం ఖచ్చితంగా అదే సందేశాన్ని పంపిందనేది వాస్తవం అని అంటున్నారు పరిశీలకులు. దీంతో వైసీపీ నేతలు కేసులు పెట్టడంలో తప్పులేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ముందటి ట్వీట్ కి వచ్చిన రియాక్షన్ ప్రభావమో ఏమో కానీ... అనంతరం "స్వామి వివేకానంద కర్మయోగలో ఇలా అంటాడు - ఒక మనిషి ప్రపంచంలోని అవహేళనలు, హేళనలను పట్టించుకోకుండా తన విధులను నిర్వర్తించాలి" అని ట్వీట్ చేశారు. దీంతో... ఆన్ లైన్ వేదికగా విమర్శలు పెరిగిపోయాయనే ఉద్దేశ్యంతో తనను తాను సమర్ధించుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ ఈ ట్వీట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... గురువారం మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని కలుసుకున్న లూథ్రా.. అనంతరం నారా లోకేష్‌ తో మంతనాలు జరిపి ఢిల్లీకి తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు క్వాష్ పిటిషన్ కూడా విచారణ ఉండటంతో సోమవారం ఆయన తిరిగి విజయవాడకు రావొచ్చు.

Tags:    

Similar News