ఆ నలుగురిలో టీపీసీసీ అధ్యక్షుడు ఎవరో? అనూహ్య ఎంపికేనా?

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు.. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పదవి.

Update: 2024-08-23 07:32 GMT

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు.. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పదవి. లక్షలాది కార్యకర్తలకు నాయకుడు.. వందేళ్లు పైబడిన పార్టీకి రాష్ట్ర నాయకుడు.. ప్రత్యర్థి పార్టీల వారు సైతం విస్మరించలేని పదవి.. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గనుక పీసీసీ చీఫ్ ‘పార్టీ ముఖ్యమంత్రే’ అని అనుకోవాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణలో ఉంది. టీపీసీసీ అధ్యక్షుడిగా జూలై వరకు బాధ్యతలు నిర్వర్తించిన రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త నాయకుడిని నియమించాల్సిన సమయం ఆసన్నమైంది.

స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట

కాంగ్రెస్ అధిష్ఠానం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీపీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాల్సి ఉంది. అందులోనూ రానున్న రోజుల్లో తెలంగాణలో పంచాయతీ నుంచి జీహెచ్ ఎంసీ వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పార్టీ అధికారంలో ఉన్న వేళ.. స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం చూపకుంటే అది చాలా ప్రభావం చూపుతుంది. మరోవైపు పదేళ్ల పాటు అధికారంలో లేనందున కాంగ్రెస్ క్యాడర్ చెల్లాచెదురైంది. స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే వీరందరినీ ఏకం చేయాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి రానున్న రోజుల్లో అత్యంత కీలకం.

బీసీకా? ఎస్సీకా? ఎస్టీకా?

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారథి మరికొద్ది రోజుల్లో ఖరారు కానున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే, టీపీసీసీ చీఫ్ ను ఏ వర్గం నుంచి ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీసీల నుంచి ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎస్సీల నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. వీరిలో ఎవరిని నియమిస్తే ప్రయోజనం అని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది. అయితే, పీసీసీ పదవి కేటాయించిన సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కదని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఎవరిని నియమించినా కొత్తవారే..

పైన పేర్కొన్న నలుగురిలో ఎవరిని టీపీసీసీ చీఫ్ చేసినా కొత్తవారే. మధు యాష్కీకి రెండుసార్లు ఎంపీగా చేసిన అనుభవం ఉంది. బలరాం నాయక్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. గతంలోనూ ఓసారి గెలిచారు. మహేశ్ గౌడ్ ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు. సంపత్ మాజీ ఎమ్మెల్యే కాగా.. లక్ష్మణ్ తొలిసారి విజయం సాధించారు. లక్ష్మణ్ ఎన్ఎస్ యూఐ నుంచి ఎదిగారు. కాగా, టీపీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ పైనా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకునే వీలుంది. మరో ఆరుగురికి కేబినెట్ లో చోటుంది. సామాజిక సమీకరణాల ప్రకారం ముగ్గురు లేదా నలుగురిని తీసుకుంటారని తెలుస్తోంది. ఇద్దరు రెడ్లు, ఎస్సీ, మైనార్టీకి చాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. నామినేటెడ్ పదవులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

అధిష్ఠానానిదే తుది నిర్ణయం..

రేవంత్ తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. వీరితో శుక్రవారం ఏఐసీసీ పెద్దలు భేటీ కానున్నారు. ఈ ముగ్గురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే పీపీసీ చీఫ్ పై తుది నిర్ణయం ప్రకటించనున్నారు. కాగా, ఎవరిని నియిమించినా తనకు అభ్యంతరం లేదని రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు.

Tags:    

Similar News