భారతీయుల ‘నమ్మకం’ నింగికి ఎగిసింది

86 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురై.. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటల వేళలో తుదిశ్వాస విడిచారు.

Update: 2024-10-10 03:54 GMT

వేదనతో ఈ విషాదాన్ని మీకు తెలియజేస్తున్నాం. భారతీయుల నమ్మకం దివికెగిసింది. అవును.. దశాబ్దాల తరబడి భారతీయుడు ఎవరైనా సరే.. ఏదైనా కొనాలనుకున్నప్పుడు.. మరేదైనా వస్తుసేవను పొందాలనుకున్నప్పుడు.. నిస్సంకోచంగా విశ్వసించే బ్రాండ్ ఏదైనా ఉందంటే.. అది టాటా గ్రూప్ నకు చెందిన ఉత్పత్తి. అలాంటి నమ్మకానికి వెన్నుముక టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 86 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురై.. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటల వేళలో తుదిశ్వాస విడిచారు.

టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించటమే కాదు.. విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడిగా ఆయన పేరుంది. యువతకు ఆదర్శప్రాయుడిగా.. గొప్ప వితరణశీలిగా పేరున్న ఆయన.. పేదోడి కారు కలను తీర్చేందుకు ఏకంగా నానో కారు తెచ్చిన రతన్ టాటా అన్నంతనే గౌరవంతోకూడిన భక్తిభావన కలుగుతుంది. చాలా రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన.. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరటం.. రోటీన్ టెస్టుల కోసం ఆసుపత్రిలో ఉన్నానంటూ మేసేజ్ పంపిన రెండు రోజులకే ఆయన పరిస్థితి విషమించి.. కన్నుమూయటం వేదనకు గురి చేసే అంశంగా చెప్పాలి.

రతన్ టాటా మరణవార్తను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. "రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాం. ఆయన నాకో గొప్ప మిత్రుడు. గురువు. మార్గదర్శకుడు. ఎంతోమందికి అమూల్యమైన సహకారం అందించిన నిజమైన అసాధారణ నాయకుడు. టాటా గ్రూప్ మాత్రమే కాదు.. మన దేశం స్వరూపం కూడా. టాటా గ్రూఫ్ కు.. ఆయన ఛైర్మన్ కంటే ఎక్కువ. వ్యాపారవేత్తలందరికి ఆయన ఒక దిక్సూచి. టాటా దాత్రత్వం లక్షలాది మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయన్ను ఇష్టపడే వారందరికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలియజేశారు.

రతన్ టాటా మరణవార్తతో రాష్ట్రపతి ముర్ము.. ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. 'ఆయనో విజనరీ .. బిజినెస్ లీడర్. అసాధారణమైన వ్యక్తి. దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక వ్యాపార సంస్థలకు సుస్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూత అందించారు. విద్య.. వైద్యం.. పారిశుద్ధ్యం.. జంతుసంరక్ష్ణ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించారు. విశిష్ఠమైన వ్యక్తిత్వంతో ఎంతోమందికి ఆఫ్తుడైన రతన్ టాటా దూరం కావటం బాధాకరం' అంటూ ప్రధానమంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. రతన్ టాటా మరణవార్త బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెళ్లారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

రతన్ టాటా లేరన్న విషయాన్ని తాను అంగీకరించలేకపోతున్నట్లుగా ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ముందడుగులో ఉండటానికి రతన్ జీవితం.. పని తీరుతో చాలా సంబంధం కలిగి ఉందన్నారు. 'ఈ సమయంలో ఆయన మార్గదర్శకత్వం అమూల్యం. మన ఆర్థిక సంపద..విజయాలకు ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లెజెండ్స్ కు మరణం లేదు' అంటూ తన వేదనను తెలియజేశారు. రతన్ టాటా ఒక టైటాన్ అంటూ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేశారు.

1937 డిసెంబరు 28న రతన్ టాటా ముంబయిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా.. సూనూ టాటా. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. రతన్ టాటా సాదాసీదా జీవితాన్ని గడిపే వ్యక్తి. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా కొడుకు రతన్ జీ టాటా దత్తత తీసుకున్న నావల్ టాటా.. సూనూ టాటా ఆయన తల్లిదండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవటంతో రతన్ జీ టాటా సతీమణి అయిన నవాజ్ బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయన సోదరుడు. నోయెల్ టాటా సవతి సోదరుడు.

ముంబయి.. సిమ్లాలో చదువుకున్న ఆయన.. అమెరికాలోని కార్నెల్ వర్సిటీలో ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్ లో చేరారు. 1991 -2012 వరకు, ఆ తర్వాత 2016-17 వరకు టాటా సంస్థ ఛైర్మన్ గా సేవలు అందించారు. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలకు ప్రతిగా భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్.. 2008లో దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారంగా చెప్పే పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తన సంపదలో 65 శాతాన్ని వివిధ స్వచ్చంద కార్యక్రమాలకు విరాళంగా అందించారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి.. యువతకు.. ఔత్సాహిక వ్యాపారవేత్తల వెనుక తానున్నానన్న భరోసా ఇచ్చి... భుజం తట్టి ముందుకు నడిపారు.

Tags:    

Similar News