లాటరీలో లిక్కర్ షాప్ పొందగానే కిడ్నాప్... ఆసక్తికర ముగింపు!

ఏపీ ప్రభుత్వం నిర్వహించిన లాటరీ కార్యక్రమం ఒకటీ రెండు చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యింది.

Update: 2024-10-15 03:57 GMT

ఏపీ ప్రభుత్వం నిర్వహించిన లాటరీ కార్యక్రమం ఒకటీ రెండు చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యింది. 26 జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం లాటరీ ద్వారా ఎంపిక 3,369 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. వీటిలో 345 దుకాణాలను మహిళలే దక్కించుకున్నారు.

ఈ మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు సందర్భంగా సత్యసాయి జిల్లాలో ఓ అనూహ్య పరిణామం నెలకొంది. ఇందులో భాగంగా.. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న ఓ వ్యాపారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు! అనంతరం హైడ్రామా నడుమ ఈ కిడ్నాప్ కథ సుఖాంతమైంది.

అవును... సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న రంగనాథ్ అనే వ్యాపారి కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని.. లాటరీలో లిక్కర్ షాప్ దక్కించుకుని బయటకు రాగానే అతడిని అపహరించి తీసుకువెళ్లినట్లు అతడి భార్య పుట్టపర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలో రంగనాథ్ కిడ్నాప్ వ్యవహారం ఆసక్తికర మలుపుతీసుకుంది. తన భర్తను కిడ్నాప్ చేశారని.. అతని ఆచూకీ తెలియజేయాలని అతని భార్య ఆందోళన చేపట్టగా.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని హిందూపురం వన్ టౌన్ స్టేషన్ లో పోలీసులకు తెలియజేశారు రంగనాథ్.

తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని.. దీంతో తనను కిడ్నాప్ చేశారని అనుకుని, తన భార్య భయబ్రాంతులకు గురై ఆందోళన చేసిందని అన్నారు. ఈ సమయంలో తన బంధువులతో కలిసి ఆందోళనకు దిగిన ఆమెతో.. పోలీసులు తన భర్తతో ఫోన్ లో మాట్లాడించారు. అయినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు.

దీంతో.. ఎట్టకేలకు హిందూపురం నుంచి రంగనాథ్ ను పుట్టపర్తి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి.. భార్య, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించారు డీఎస్పీ. ఈ సందర్భంగా స్పందించిన రంగనాథ్... తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పుట్టపర్తి పోలీసులకు తెలిపారు!

Tags:    

Similar News