జగన్ న్యూ స్ట్రాటజీ : లోకేష్ కి ప్రత్యర్థి ఆయనే ?

ఆ తరువాత ఎన్నికలు దగ్గర పడినాక ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తె అయిన లావణ్యను బరిలోకి దింపింది.

Update: 2024-10-11 03:35 GMT

మంగళగిరిలో అయిదు వేల ఓట్ల తేడాతో 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయిన నారా లోకేష్ గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి 2024లో ఏకంగా తొంబై వేల పై చిలుకు మెజారిటీ సాధించి ఏపీలోనే అతి పెద్ద మెజారిటీల్లో ఒకటిగా భారీ విజయం అందుకున్నారు. లోకేష్ మీద ప్రత్యర్థి ఎవరు అన్నపుడు వైసీపీ రకరకాలైన ప్రయోగాలు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిని చివరి నిముషంలో కాదని చిరంజీవిని దింపింది. ఆ తరువాత ఎన్నికలు దగ్గర పడినాక ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తె అయిన లావణ్యను బరిలోకి దింపింది.

అయితే ఓడిన తరువాత డే వన్ నుంచే లోకేష్ మంగళగిరిలో తన ప్రచారం మొదలెట్టారు. జనాలతో నేరుగా కనెక్షన్ పెట్టుకున్నారు. సొంత నిధులు వెచ్చించి పలు పధకాలు కూడా అందించారు. ఇలా లోకేష్ కి అన్నీ కలసి వచ్చాయి. దానికి తోడు అన్నటుగా కూటమి ప్రభంజనం కూడా తోడు అయి బంపర్ మెజారిటీని సొంతం చేసుకున్నారు.

ఇక వైసీపీ భారీ ఓటమి చెందాక మంగళగిరిలో పూర్తిగా నిరాశ ఏర్పడింది. మురుగుడు హనుమంతరావు తగ్గిపోయారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సైలెంట్ అయ్యారు. చిరంజీవి అయితే సౌండ్ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల ఆలస్యంగా జగన్ మంగళగిరి నియోజకవర్గం మీద సమీక్ష చేశారు

నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిని కూడా ఆయన ఎంపిక చేసి ప్రకటించారు. ఆయన కొత్త పేరు కావడం విశేషం. వేమారెడ్డిని ఆయన అక్కడ నియమించారు. కేడర్ కి పూర్తిగా అందుబాటులో ఉంటారు అని భావించి ఆయనకు పగ్గాలు అప్పచెప్పారు.

అయితే 2024 ఎన్నికలకు ముందు బీసీల సీటు అని చేనేతలు ఎక్కువగా ఉన్నారని ఆళ్ళను తప్పించి మొదట చిరంజీవి ఆ తరువాత లావణ్య పేర్లను ప్రకటించిన అధినాయకత్వం ఇపుడు తిరిగి రెడ్డి సామాజికవర్గం వైపే చూడడం విశేషం.

మరి ఆళ్ళని ఇంచార్జిగా ఎందుకు ప్రకటించలేదో తెలియదు. ఆయనే వద్దు రాజకీయాలు అనుకుని సైలెంట్ అయ్యారా లేక కొత్త ముఖం అని వేమిరెడ్డిని తెచ్చారా అన్నది చూడాలి. వేమిరెడ్డి అయిదేళ్ళ పాటు పార్టీని నడిపిన తరువాత ఎన్నికల వేళ మళ్లీ బీసీ కార్డు అని ఎవరిని అయినా నిలబెడతారా అన్నది కూడా చర్చగా ఉంది.

అయితే మంగళగిరిలో నారా లోకేష్ తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ పెట్టి వినతులు స్వీకరిస్తున్నారు. ఆయన తన నియోజకవర్గం ఎక్కడా పక్కకు పోకుండా బలం ఏ మాత్రం తగ్గకుండా తగిన చర్యలే తీసుకుంటున్నారు.

వేమిరెడ్డి విపక్షం నుంచి లోకేష్ కి ఏ రకమైన పోటీ ఇస్తారో చూడాలి. ప్రభుత్వం మీద పోరాటం చేయడం అన్నది ఇపుడు వైసీపీ ఆలోచన. ఆ విధంగా నారా లోకేష్ నియోజకవర్గంలో చేసి మంత్రిగా ఆయన పరిష్కరించలేని సమస్యలను వెలుగులోకి తెచ్చి జనాభిమానం పొందితే అపుడు వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది. ఆ దిశగా వేమిరెడ్డి ఎంత వరకూ ముందుకు పోగలరు అన్న దాని మీదనే మంగళగిరిలో వైసీపీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. వైసీపీ ఎవరిని పెట్టినా నారా లోకేష్ తన కేడర్ తో గట్టిగానే ఉన్నారు, పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ సైకిల్ ని కదల్చడం కష్టమని తమ్ముళ్ళు అంటున్నారు.

Tags:    

Similar News