విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్... తెరపైకి 2019 నాటి కేసు!

వాస్తవానికి ఈ కేసు వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడినట్లు చెబుతున్నారు.

Update: 2024-08-29 08:28 GMT

ఏపీ మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు ఆయన గురువారం వెళ్లారు. ఓ పత్రికపై పరువు నష్టం కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసు వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది!

అవును... "చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి" పేరుతో ఓ ప్రముఖ దిన పత్రికలో గతంలో ప్రచురితమైన ఓ కథనంపై నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పత్రికపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు నిమిత్తం ఆయన తాజాగా విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు.

కాగా... టీడీపీ ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం మారిన తర్వాత అక్టోబరు 22 - 2019న ఓ ప్రముఖ దినపత్రికలో "చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి" శీర్షికతో ఓ ప్రముఖ దినపత్రికలో కథనం ప్రచురితమైంది.

వైజాగ్ పర్యటన సమయంలో విశాఖ ఎయిర్ పోర్ట్ లాబీల్లో జరిగిన మీటింగ్స్ లో సప్లయి చేసిన స్నాక్స్ కోసం ఖర్చు చేశారని ఆ కథనంలో పేర్కొన్నారు. కొన్ని ఇతర పత్రికలు కూడా ఈ వార్తను ప్రచురించాయి. అయితే... సదరు పత్రికలు మాత్రం తప్పుడు సమాచారం వల్ల అలా రాసినట్లు వివరణ ఇచ్చాయని అంటారు. అయితే ప్రముఖ దినపత్రిక నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు!

దీంతో... ఇది పూర్తిగా అవాస్తవమని.. ఉద్దేశ్యపూర్వకంగా తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి కథనాలు ప్రచురించారంటూ కోర్టును ఆశ్రయించి సదరు దినపత్రికకు లోకేష్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించేందుకు పూర్తిగా అసత్యాలతో ఆ ఆర్టికల్ రాశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించే తాజాగా లోకేష్ విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు.

Tags:    

Similar News