'భాగ్యనగర మెల్ల సౌఖ్యమా...' బీఆర్ఎస్ ఎంపీల కు షాకిచ్చిన కన్నడ ఎంపీలు!
బీజేపీ ఎంపీ.. ఒక్కసారిగా "భాగ్యనగరం ఎల్ల సౌఖ్యమా.." అంటూ.. ఎద్దేవా చేసినట్టు వ్యాఖ్యానించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ లాబీల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే.. మణిపూర్ అంశం పై విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభ ను కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం.. ప్రారంభ మైన సభ లో కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ సహా.. బీఆర్ఎస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే.. దీని పై చర్చను ఇప్పుడు చేపట్టేది లేదని.. తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ వ్యాఖ్యానించారు. అనంతరం మళ్లీ రగడ చోటు చేసుకోవడంతో సభను వాయిదా వేశారు.
అయితే.. బీఆర్ఎస్ ఎంపీలు.. కేంద్రం పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత.. సభ వాయిదా పడిన తర్వాత.. లాబీల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు.. బీఆర్ఎస్ ఎంపీల కు ఎదురు పడ్డారు. వీరి లో ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎంపీల తో చనువు వున్న నాయకులే కావడంతో మాటామాటా కలిపారు. ఈ సందర్భంగా చుట్టూ మరికొంత మంది ఎంపీలు పోగయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీలు.. నామా నాగేశ్వరరావు వంటివారు తామిచ్చిన అవిశ్వాస తీర్మానం పై వారేదో అడుగుతారని అనుకున్నట్టుగా ఫేస్ పెట్టారు.
ఏం అడిగినా.. చెప్పేందుకు రెడీ అన్నట్టుగా నామా రెడీ అయ్యారు. అయితే, కర్ణాటక కు చెందిన బీజేపీ ఎంపీ.. ఒక్కసారిగా "భాగ్యనగరం ఎల్ల సౌఖ్యమా.." అంటూ.. ఎద్దేవా చేసినట్టు వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. గత ఐదు రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. వర్షాకాలం లో వర్షాలు కురవక ఏంకురుస్తాయి. కానీ, ఇక్కడ సదరు ఎంపీ ఉద్దేశం వేరు. కురిసిన నీరు కురిసినట్టు వెళ్లిపోవాలి. అలా వెళ్లకుండా ఆ నీటి కారణంగా లోతట్టు ప్రాంతాలు సహా కీలక ప్రాంతాలు కూడా నీట మునుగుతున్నాయి. దీని పై జాతీయస్థాయి మీడియా కూడా కథనాలురాస్తోంది.
మరోవైపు బెంగళూరుతో తాము పోటీ పడుతున్నామని తెలంగాణ మంత్రి చెబుతున్నారు. బెంగళూరు లోనూ వర్షాలు కురిసినా.. ఈ రేంజ్ లో అయితే నీరు నిలవదు. వెంటనే క్లియర్ అవుతుంది. ఇదే విషయాన్ని సదరు ఎంపీ క్రాస్ చేస్తూ.. భాగ్యనగరం ఎల్ల సౌఖ్యమా.. అని ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా.. తమ వారు హైదరాబాద్ లో నే ఉంటున్నారని.. వారు ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారని.. కాస్త మీ సిబ్బందిని పంపించి క్లియర్ చేయించండని మరో తెలుగు వచ్చిన బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. దీంతో నామా నాగేశ్వరరావు కు ఒకింత ఆగ్రహంతో కూడిన ఆవేదన ఎదురైంది. ఉద్దేశ పూర్వకంగా బీజేపీ నేతలు ఇలా.. తమ పై కసి తీర్చుకుంటున్నారని తన అనుకూల మీడియా మిత్రుల వద్ద నామా వ్యాఖ్యానించడం గమనార్హం.