విశాఖకు మళ్ళీ లూలూ గ్రూప్ ?
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల వరద పారించాలని చూస్తున్నారు.
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల వరద పారించాలని చూస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి అయింది. దాంతో ఏ మాత్రం జాప్యం లేకుండా ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం కోసం బాబు యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. పెట్టుబడులు వస్తేనే తప్ప ఏపీలో సంపద సృష్టి కాదు, అంతే కాకుండా యువతకు ఉపాధి కూడా దక్కదు. అందుకే చంద్రబాబు ఈ విషయం మీదనే సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారని అంటున్నారు.
తాజాగా అధికారులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించినపుడు గతంలో తన పాలనలో పెట్టుబడులు పెట్టి వైసీపీ హయాంలో వెనక్కి పోయిన వారి వివరాలు లిస్ట్ అవుట్ చేయమని కోరారని తెలుస్తోంది. వారు ఏ కారణం వల్ల వెనక్కి వెళ్లారో తెలుసుకుంటే వారిని మళ్లీ ఆహ్వానించవచ్చు అన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు.
చంద్రబాబు గత పాలనలో విశాఖలో అరబ్ ఎమిరేట్స్ కి చెందిన లూలూ గ్రూప్ పెట్టుబడులు భారీగా పెట్టేందుకు వచ్చింది. విశాఖలో బీచ్ రోడ్డుకు ఎదురుగా ఉన్న సుమారు పద్నాలుగు ఎకరాల స్థలాన్ని లూలూ గ్రూపునకు చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు అప్పగించింది. ఆ భూమిలో అద్భుతమైన కన్వెన్షన్ సెంటర్ తో పాటు మల్టీప్లెక్స్ అలాగే ఫైవ్ స్టార్ హోటల్ ని నిర్మించి ఇవ్వడానికి లూలూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలను చేసుకుంది.
దీని కోసం ఏకంగా 2,200 కోట్ల రూపాయల బడ్జెట్ ని వెచ్చించడానికి కూడా ముందుకు వచ్చింది. అయితే ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లూలూ గ్రూప్ ఏపీని విడిచి వెళ్ళిపోయింది. వైసీపీ ప్రభుత్వం అయితే లూలూకు చంద్రబాబు ప్రభుత్వం ఎకరం కేవలం నాలుగు లక్షలు వంతున కారు చౌకగా కట్టబెట్టిందని ఆరోపించింది.
ఇది లూలూ గ్రూప్ నకు లాభం కానీ ప్రజలకు ప్రభుత్వానికి కాదని కూడా వాదించింది. అక్కడ లూలూకి ప్రభుత్వం ఇచ్చిన భూమి విలువ ఏకంగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఉంటుందని కూడా స్పష్టం చేసింది. మరి మార్చిన అగ్రిమెంట్ మేరకు ఒప్పందాలను లూలూ చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయిందో మరే కారణంలో తెలియదు కానీ లూలూ మాత్రం ఏపీ నుంచి లెఫ్ట్ అయింది.
దాని మీద టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు. లూలూ గ్రూప్ ని వైసీపీ తరిమేసిందని కూడా ఆరోపించారు. ఇవన్నీ పక్కన పెడితే మళ్లీ లూలూ గ్రూప్ ని సాదరంగా ఆహ్వానించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. ఈ మేరకు అధికారుల స్థాయిలో మొదట సంప్రదింపులు జరిపి సానుకూల స్పందన వస్తే ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగుతారు అని అంటున్నారు.
లూలూ గ్రూప్ ని విశాఖ తీసుకుని వస్తే మల్టిప్లెక్స్ ఫైవ్ స్టార్ హోటల్ వల్ల కన్వెషన్ సెంటర్ వల్ల బిజినెస్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని భావిస్తున్నారు. మరి లూలూ గ్రూప్ ఏపీకి తిరిగి రావడానికి అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. అదే సమయంలో ఏపీ నుంచి గతంలో వెళ్ళిన బిజినెస్ పీపుల్ తమ పెట్టుబడులను మిగిలిన చోట్ల పెడితే మాత్రం ఇప్పట్లో ఈ వైపునకు చూసే చాన్స్ లేదు. అలా కాకుండా ఏపీలో కూడా విస్తరించాలని భావిస్తే మాత్రం తప్పనిసరిగా వారు ఏపీకి రావడం జరుగుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా లూలూ గ్రూప్ విశాఖకు వస్తే మేలు జరుగుతుందని అంతా అంటున్నారు.