యాష్కీకి పట్టం.. పీసీసీ పీఠం ఆయనకే?
తెలంగాణ పీసీసీ పీఠం ఎవరిక దక్కుతుందనేది కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది.
తెలంగాణ పీసీసీ పీఠం ఎవరిక దక్కుతుందనేది కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకరికి మించిన సంఖ్యలో నాయకులు ప్రయత్నాలు చేయడం.. సామాజిక సమీకరణలు, సిఫారసులు ఇలా.. అనేకం ఈ పదవి చుట్టూ చుట్టుముట్టిన విషయం తెలిసిందే. కీలకమైన పదవి కావడంతో ఓ రేంజ్‌లో నాయకులు పోటీ పడ్డారు. ఒకానొక దశలో ఎస్టీలకు ఖాయం చేశారన్న వాదన కూడా వినిపించింది. మొత్తం 22 మంది పేర్లతో కాంగ్రెస్ అధిష్టానం బాగానే కుస్తీ చేసింది.
చిట్టచివరకు.. ఈ జాబితాలో రెండు పేర్లు నిలిచాయని ఢిల్లీ వర్గాల కథనం. అది కూడా ఇద్దరూ రెడ్డి సామా జిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. బీసీలకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. ఆ వర్గానికి చెందిన గౌడ నాయకులకే పార్టీ పెద్దపీట వేస్తోంది. వీరిలో ప్రధానంగా మధు యాష్కీ గౌడ్ పేరు వినిపిస్తుండడం గమనార్హం. కేంద్రంలోని పెద్దలతో నేరుగా సంబంధాలు ఉండడంతోపాటు.. గతంలోనూ కీలక పదవుల్లో చేసిన అనుభవం వంటివి యాష్కీకి ఇప్పుడు కలిసి వస్తున్నాయి.
ఇక, మరో నాయకుడు మహేష్‌కుమార్ గౌడ్. ఈయన పేరు కూడా బలంగానే ఉంది. అందుకే చివరి వరకు కూడా రేసులో కొనసాగారు. ప్రస్తుతం కూడా ఆశలు బాగానే ఉన్నాయి. కానీ, ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పీసీసీ చీఫ్ పదవిని మధు యాష్కీ గౌడ్‌కు ఖరారు చేసినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనున్నారు. ఇదిలావుంటే.. ఈ పదవిని దక్కించుకునేందుకు మంత్రుల నుంచి అనేక మంది ప్రయత్నించారు.
కానీ, చివరకు యాష్కీకి పట్టం కట్టే దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యాష్కీ.. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అనేక విమర్శలు.. వివాదాలకు గురైన సందర్భంలో కూడా.. ఆయన పార్టీని అంటిపెట్టుకున్నారు. అధిష్టానానికి విధేయుడి గా.. విశ్వాసపాత్రుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇలా.. అనేక విషయాలు ఆయనకు కలిసి వచ్చాయని తెలుస్తోంది.