లేడీ లెక్చరర్ గా పరిచయం.. కట్ చేస్తే రేప్ చేస్తాడు.. బాధితులు ఎంతమందంటే?

సీధీ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బ్రజేశ్ ప్రజాపతి ఒక యాప్ సాయంతో తనను తాను ఒక కాలేజీ లేడీ లెక్చరర్ గా పరిచయం చేసుకునేవాడు.

Update: 2024-05-26 04:53 GMT

మధ్యప్రదేశ్ లో ఒక దుర్మార్గుడి దురాగతం బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఇతగాడి గురించి తెలిసినోళ్లంతా షాక్ అవుతున్నారు. మహిళా లెక్చరర్ గా ఆన్ లైన్ లో పరిచయం చేసుకొని.. విద్యార్థినుల్ని ట్రాప్ చేసి అత్యాచారం చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వారి దుర్మార్గం గురించి పోలీసులు చెప్పిన వైనం తెలిస్తే ఒళ్లు జలదరించాల్సిందే. సీధీ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బ్రజేశ్ ప్రజాపతి ఒక యాప్ సాయంతో తనను తాను ఒక కాలేజీ లేడీ లెక్చరర్ గా పరిచయం చేసుకునేవాడు. స్కాలర్ షిప్ పనులు ఉన్నాయంటూ విద్యార్థినులకు ఫోన్ చేసేవాడు. అతగాడి ట్రాప్ కు తెలీకుండా అమాయకులు వలలో పడినంతనే.. నా కొడుకు మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాడంటూ చెప్పి మంచిగా మాట్లాడేవాడు. అలా నమ్మి వచ్చిన అమ్మాయిల్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేసేవాడు. వారి నుంచి సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యేవాడు.

ఇతగాడి దుర్మార్గానికిబలైన ఒక బాధితురాలు మే పదహారును పోలీసుల్ని ఆశ్రయించి చెప్పటంతో మొదటి కేసు బుక్ అయ్యింది. ఆ తర్వాత ఇదే తరహాలో మరోమూడు కేసులు నమోదయ్యాయి. దీంతో.. పోలీసులు అలెర్టు అయ్యారు. ఈ సీరియల్ రేపిస్టు కోసం రంగంలోకి దిగారు. తమ విచారణలో భాగంగా నిందితుడి చేతిపైన కాలిన గాయం ఉంటుందని గుర్తించిన పోలీసులు.. అతడ్ని అరెస్టు చేశారు.

తమదైన శైలిలో విచారణ చేపట్టిన అనంతరం.. తాను ఏడుగురు అమ్మాయిల్ని రేప్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. అయితే.. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమ్మాయిల ఫోన్ నెంబర్ల కోసం కాలేజీ వాట్సాప్ గ్రూపుల నుంచి సేకరించేవారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు. ఈ ఘోరాన్ని తీవ్రంగా ఖండించటంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొంటూ సిట్ ను ఏర్పాటు చేశారు. వారంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడా రాష్ట్రంలో కలకలాన్ని రేపుతోంది.

Tags:    

Similar News